Andhra News: విశాఖ బీచ్‌ రోడ్డులో సీఎం ఇల్లు?

విశాఖకు రాజధాని తరలింపు పనులపై స్థానిక జిల్లా యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని త్వరలో విశాఖకు తరలిపోతుందని, తాను అక్కడి నుంచే పాలన సాగిస్తానని సీఎం జగన్‌ ఇటీవల దిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రకటించారు.

Updated : 07 Feb 2023 07:28 IST

అన్వేషిస్తున్న అధికారులు
మార్చి 22 లేదా 23న గృహ ప్రవేశం?
రాజధాని తరలింపునకు వేగంగా సన్నాహాలు

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖకు రాజధాని తరలింపు పనులపై స్థానిక జిల్లా యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని త్వరలో విశాఖకు తరలిపోతుందని, తాను అక్కడి నుంచే పాలన సాగిస్తానని సీఎం జగన్‌ ఇటీవల దిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రకటించారు. పలువురు మంత్రులు సైతం కొంతకాలంగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగానికి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. అయితే... రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం మౌఖిక ఆదేశాలు అందుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపునకు సంబంధించిన సమాచారం ఏక్షణంలో వచ్చినా ఏర్పాట్లు చేసేందుకు వీలుగా అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని భవనాలను మూడో కంటికి తెలియకుండా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ విశాఖలో ఉండడానికి బీచ్‌ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు. అన్నీ అనుకూలిస్తే మార్చి 22, 23 తేదీల్లో గృహ ప్రవేశం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. వీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్తు పక్క నుంచి రహదారి విస్తరణ పనులను చేపట్టారు. ఈ మార్గంలోనే సీఎం నివాసం ఉంటుందని సమాచారం. మంత్రులు కూడా తమకు అనుకూలమైన భవనాల కోసం వెతుకుతున్నారు. మరోవైపు ఏఎంసీ అంకోశా సమీపంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల కోసం చేపట్టిన డూప్లెక్స్‌ ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కూడా పరిచయస్థుల ద్వారా విశాఖలో నివాసాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఈ విషయాలేవీ అధికారులు ధ్రువీకరించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు