Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్‌

సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన అన్ని రకాల సెలవులు సచివాలయాల ఉద్యోగులకూ వర్తిస్తాయని పురపాలకశాఖ ఒక వైపున చెబుతూనే...ఇంకో వైపున పన్నుల బకాయిలు వసూలు చేసే వరకు సెలవుల్లేవని పుర, నగరపాలక సంస్థల్లో అధికారులు ఆదేశాలివ్వడం చర్చనీయాంశమవుతోంది.

Updated : 07 Feb 2023 08:54 IST

వార్డు సచివాలయాల ఉద్యోగులకు అధికారుల షాక్‌
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ పేరుతో సర్క్యులర్‌
పన్ను బకాయిల వసూళ్లే లక్ష్యంగా ప్రణాళికలు

ఈనాడు, అమరావతి: సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన అన్ని రకాల సెలవులు సచివాలయాల ఉద్యోగులకూ వర్తిస్తాయని పురపాలకశాఖ ఒక వైపున చెబుతూనే...ఇంకో వైపున పన్నుల బకాయిలు వసూలు చేసే వరకు సెలవుల్లేవని పుర, నగరపాలక సంస్థల్లో అధికారులు ఆదేశాలివ్వడం చర్చనీయాంశమవుతోంది. ఆస్తి పన్ను, నీటి, యూజీడీ ఛార్జీలు, వినియోగ రుసుముల బకాయిలు మార్చి నెల 31లోగా వసూలు చేయాల్సి ఉన్నందున, సెలవు దినాల్లోనూ విధులకు హాజరవ్వాలని అధికారులు ఆదేశించడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ తరఫున ఈనెల 2న అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌ నాలుగు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. మిగతా నగరపాలక సంస్థల్లోనూ ఇదే విధమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

ప్రజలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం

వార్షిక అద్దె విలువ(ఏఆర్వీ) ఆధారంగా ఆస్తి పన్ను విధించే విధానం స్థానంలో ఆస్తి మూల విలువ(సీవీ)పై పన్ను వేసే పద్ధతిని ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టాక ఆస్తి పన్ను గత రెండేళ్ల వ్యవధిలో 30% శాతానికిపైగా పెరిగింది. ఏప్రిల్‌ తరువాత మరోసారి పన్నులు పెరగనున్నాయి. రెండేళ్లుగా 42 నగరాలు, పట్టణాల్లో అమలు చేస్తున్న చెత్త పన్ను దశల వారీగా మిగిలిన పుర, నగరపాలక సంస్థల్లోనూ అమలు చేయనున్నారు. చెత్త పన్ను విషయంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ముగియనున్నందున, పన్ను బకాయిల వసూళ్లపై జోన్లు, సర్కిళ్ల వారీగా ఆదాయ సమీకరణ లక్ష్యాలను కమిషనర్లు నిర్దేశించారు. దీంతో అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ పెట్టి పన్నుల బకాయిల వసూళ్లకు ప్రజలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే సచివాలయాల్లోని ఉద్యోగుల సెలవులను మార్చి 31 వరకు రద్దు చేశారు. వాలంటీర్ల సాయంతో పన్ను బకాయిలు చెల్లించని ఇళ్లకు వెళ్లి ఒత్తిడి తేనున్నారు. ఆస్తుల జప్తు వాహనాలను కూడా డివిజన్లు, వార్డుల్లో తిప్పాలని కొందరు కమిషనర్లు రెవెన్యూ విభాగ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

రూ.823.85 కోట్ల వసూళ్ల లక్ష్యం

రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థల్లో మార్చి 31లోగా రూ.823.85 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు వసూలు చేయాలని నిర్ణయించారు. వసూళ్లలో వెనుకబడిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2022-23లో ఆస్తి పన్ను ఆదాయ లక్ష్యం 1,971.16 కోట్లలో ఇప్పటివరకు రూ.1,171.16 కోట్లు వసూలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని