Andhra News: నేటికీ జీతాల్లేవ్..!
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో సుమారు 60శాతం మందికి జనవరి నెల జీతం ఇంతవరకు అందనేలేదు. ఫిబ్రవరి ఆరో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పించాలని ఆర్థికశాఖకు, సీఎస్‌కు వినతులు
ఉపాధ్యాయుల్లో దాదాపుగా ఎవ్వరికీ పడలేదు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో సుమారు 60శాతం మందికి జనవరి నెల జీతం ఇంతవరకు అందనేలేదు. ఫిబ్రవరి ఆరో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుల్లో దాదాపుగా ఎవ్వరికీ రాలేదు. వ్యవసాయ శాఖలోనూ ఇలాంటి పరిస్థితే. కొన్ని శాఖల్లో కొందరికి ఇవ్వగా.. మరికొందరికి ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చేది అధికారులు స్పష్టంగా చెప్పడం లేదు. ఈ నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా జీతభత్యాలకు కలిపి దాదాపు రూ.6 వేల కోట్ల వరకు అవసరమవుతాయని, ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొంటున్నారు. జీతాలు చెల్లించాలని కోరుతూ ఏపీ సచివాలయం ఎస్‌ఓల సంఘం అధ్యక్షుడు రంగస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఆర్థికశాఖ అధికారులకూ ఇచ్చారు. ఏపీ ఎన్జీవో సంఘం కూడా సీఎస్‌కు విన్నవించింది. ఇంటి అద్దె, ఫీజులు, ఆసుపత్రి ఖర్చులు, ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంది. సచివాలయంలో ఆర్థిక, సాధారణ పరిపాలన, అసెంబ్లీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు జీతాలు అందాయి. మిగతా వారిలో కొందరికే ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత, గృహ రుణాలు తీసుకున్నవారే ఉంటున్నారు. వారు ఐదో తేదీలోగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతినెలా జాప్యం కారణంగా సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. దాంతో బయట ప్రైవేటుగా అప్పులు చేసి ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోందని కొందరు పేర్కొంటున్నారు. జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరామన్నారు. ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లు విడుదల చేశారని సీఎస్ చెప్పారని, మిగతా మొత్తాన్ని ఇచ్చేలా ఆర్థిక శాఖకు చెబుతానని హామీ ఇచ్చారని ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి శివారెడ్డి వెల్లడించారు. తక్షణమే జీతాలు, పెన్షన్లు చెల్లించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ప్రయోజనాలూ సకాలంలో ఇవ్వడం లేదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ap-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..