వేదవతి ఘోషిస్తోంది!
అక్కడ సాగు నీటికి భరోసా ఇచ్చే నీటి వనరులు తక్కువ. రెండు చిన్న నదులున్నా వర్షాలే దిక్కు. కొన్ని చెరువులున్నా వాటిలో నీళ్లు చేరడమూ అంతంత మాత్రమే.
మూడున్నరేళ్లుగా నిలిచిన ఎత్తిపోతల పనులు
రూ.1942 కోట్లకు కేవలం రూ.100 కోట్లే ఖర్చు
ప్రాజెక్టు డిజైన్లకు అనుమతి తెచ్చుకోలేని దుస్థితి
కర్నూలు పశ్చిమ ప్రాంతాల నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
అక్కడ సాగు నీటికి భరోసా ఇచ్చే నీటి వనరులు తక్కువ. రెండు చిన్న నదులున్నా వర్షాలే దిక్కు. కొన్ని చెరువులున్నా వాటిలో నీళ్లు చేరడమూ అంతంత మాత్రమే. బోర్లు తవ్వుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. చేసేందుకు పనులూ ఉండవు. ఫలితంగా వలసలు నిత్యకృత్యం. మధ్య వయసు వ్యక్తులతోపాటు యువకులూ గుంటూరు, బెంగళూరు, హైదరాబాద్‌లకు పొట్టచేత పట్టుకుని వెళుతున్నారు. ఈ కరవు నేలకు తాగు, సాగు నీటిని అందించేందుకు తెదేపా హయాంలో చేపట్టిన వేదవతి ఎత్తిపోతల పథకం పనులు ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక మూలనపడ్డాయి. ఆయా కరవు పీడిత ప్రాంతాల్లో ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి పర్యటించగా దారుణ పరిస్థితులు కనిపించాయి. తాగు, సాగునీటికి అల్లాడుతున్న కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు వేదవతి ఎత్తిపోతల పథకం వరదాయిని. ఈ ప్రాంతం మీదుగానే హంద్రీ, హగరి నదులు ప్రవహిస్తున్నా సరిగా ఉపయోగ పడటం లేదు. దాంతో ఆలూరు, హాలహర్వి, హొలగుండ, చిప్పగిరి, ఆదోని, కౌతాలం మండలాల్లోని 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని, 253 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లోని 10 లక్షల మంది జనాభాకు తాగు నీటిని అందించే లక్ష్యంతో 2019 జనవరిలో అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రూ.1,942.80 కోట్లతో అంచనా వ్యయంతో పాలనామోదం ఇచ్చింది. టెండర్లు పిలిచి పనులను అప్పగించింది. ప్రభుత్వం మారాక మూడున్నరేళ్లలో వేదవతి పనులు మందగించాయి. అక్కడక్కడా చిన్నచిన్న పనులు చేయడం తప్ప పనులు ముందుకు సాగింది లేదు. చేసిన పనులకూ ఇంతవరకు బిల్లులు చెల్లించింది లేదు. ఈ ప్రాజెక్టు డ్రాయింగు, డిజైన్లు కేంద్ర ఆకృతుల సంస్థ వద్ద పెండింగులో ఉన్నాయని అధికారులు చెబుతుండటం గమనార్హం.
ఇదీ ఎత్తిపోతల స్వరూపం
హాలహర్వి మండలం అమృతాపురం వద్ద వేదవతి నదిలో నుంచి వరద రోజుల్లో 8.292 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది ప్రణాళిక. హాలహర్విలో 2.029 టీఎంసీలు, మొలగవల్లిలో 1.027 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తారు. హాలహర్వి పంపుహౌస్ ద్వారా 4.15 టీఎంసీల నీటిని గ్రావిటీ కాలువ నుంచి మొలగవల్లి పంప్‌హౌస్‌కు తరలిస్తారు. మరోవైపు హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి దీనికి అనుబంధంగా ఒక టీఎంసీ నీటిని తీసుకునేందుకు వీలుగా మరో పంపుహౌస్, పైపులైను నిర్మించనున్నారు.
* గ్రావిటీ కాలువ ద్వారా 22 వేల ఎకరాలకు, హాలహర్వి జలాశయం నుంచి 78.940 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి 40వేల ఎకరాలకు, మొలగవల్లి జలాశయం కుడి, ఎడమ కాలువల ద్వారా మరో 18వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి.
ఎక్కడి పనులు అక్కడే...
ప్రాజెక్టు పనుల్లో మూడున్నరేళ్లుగా పురోగతి లేదు. రూ.1,942 కోట్ల విలువైన పనులకు రూ.100 కోట్ల పనులే చేశారు. పైగా ప్రభుత్వం రూ.17 కోట్ల బిల్లులనే చెల్లించిందని, ఇంకా రూ.84 కోట్లు విడుదల చేయాల్సి ఉందని సమాచారం. మొత్తంగా 4,781 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇంతవరకు 52 ఎకరాలకు సంబంధించిన అవార్డు పాస్ చేశారు. మరో 600 ఎకరాల భూసేకరణకు ప్రయత్నాలు వివిధ దశల్లో ఉన్నాóు. గ్రావిటీ కాలువ కోసం కేవలం 53వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలే జరిగాయి. దాదాపు 8 కి.మీ. పొడవున 3,200 ఎంఎం, 2,000 ఎంఎం డయా ఎంఎస్ పైపులు వేసినట్లు పేర్కొన్నారు. కానీ... క్షేత్ర స్థాయికి వెళ్లి చూస్తే అవి కొన్నిచోట్ల తుప్పు పట్టి కనిపించాయి.
భూమికి భూమి ఇవ్వాలని బిలేహాలులో ఆందోళన
హాలహర్వి జలాశయం కోసం బిలేహాలు గ్రామ సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు అదనంగా మరికొంత భూమిని తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్టత లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం కోసం తమ పొలాలు, భూములు తీసుకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని అక్కడి రైతులు డిమాండు చేస్తున్నారు.
సాగుభూములున్నా నీరేదీ
- ప్రవీణ్‌కుమార్, మొలగవల్లి
వేదవతి పనులు జరగడం లేదు. కర్ణాటక సరిహద్దులో ఉన్న మా ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఎంతో అవసరం. ఇక్కడి నల్లరేగడి, ఎర్ర నేలలు సాగుకు అనుకూలమైనవైనా నీటి వసతి లేదు. పనులు, సరైన ఉద్యోగాలు లేక ప్రజలు వలస వెళుతున్నారు. 8 టీఎంసీలను ఉపయోగించుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు వస్తేనే ఉపయోగం.
వర్షాలే పడవు
- రామాంజనేయులు, హాలహర్వి
మమ్మల్ని ప్రకృతి కరుణించడం లేదు. వర్షాలు అసలే పడవు. అప్పుడప్పుడూ అతి వృష్టివల్ల నష్టపోతున్నాం. పంటలను కోల్పోతున్నాం. వేదవతి ప్రాజెక్టు నిర్మిస్తేనే మాకు నీళ్లు. నాలుగేళ్లుగా పెద్దగా పనులేమీ చేయలేదు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ap-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..