అంగన్‌వాడీల ఆందోళన బాట

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణకంటే మిన్నగా వేతనాలిస్తామని,  అందరికీ న్యాయం చేస్తామని పాదయాత్ర సందర్భంగా సెల్ఫీలు తీసుకుని మరీ హామీనిచ్చిన ముఖ్యమంత్రి జగన్‌.

Updated : 07 Feb 2023 10:01 IST

తెలంగాణకంటే మిన్నగా వేతనాలేవీ?
పాదయాత్రలో హామీ ఇచ్చారు కదా..
నాసిరకం సరకులిస్తూ నాణ్యత లేదని వేధింపులా?
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణకంటే మిన్నగా వేతనాలిస్తామని,  అందరికీ న్యాయం చేస్తామని పాదయాత్ర సందర్భంగా సెల్ఫీలు తీసుకుని మరీ హామీనిచ్చిన ముఖ్యమంత్రి జగన్‌.. ఇప్పుడు మాట తప్పి అన్యాయం చేస్తున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పనన్న సీఎం.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణకంటే ఎక్కువగా ఎందుకు వేతనాలివ్వడం లేదని ప్రశ్నించారు. నెలకు రూ.11,500 వేతనమిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి సంక్షేమ పథకాలను రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. భర్తను కోల్పోయిన పేద అంగన్‌వాడీ కార్యకర్తలకు వితంతు పింఛనూ నిలిపేశారని దుయ్యబట్టారు. పనికిరాని యాప్‌లు తీసుకొచ్చి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వాపోయారు. నాసిరకం సరకులు పంపిణీ చేసి మెనూ నాణ్యంగా ఉండాలని చెబుతున్నారని వివరించారు. తనిఖీల పేరుతో ఫుడ్‌ కమిషనర్లు వేధింపులకు పాల్పడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట సోమవారం బైఠాయించారు. కొన్ని ప్రాంతాల్లో కలెక్టరేట్ల వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ముఖ ఆధారిత హాజరు విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే రానున్న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా చలో విజయవాడకు పిలుపిస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీల నిరసనకు సీఐటీయూ మద్దతు తెలిపింది.

అనంతపురంలో గృహనిర్బంధం

నిరసనల్లో పాల్గొనకుండా అనంతపురంలో అంగన్‌వాడీ సంఘాల నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.  మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ ముట్టడికి హాజరయ్యేందుకు బస్సులు, ఇతర వాహనాల్లో వెళుతున్న కార్యకర్తల్ని హైవే పైనే అడ్డుకుని దింపేశారు. బాపట్ల కలెక్టర్‌కు విన్నపాన్ని ఇచ్చేందుకు వెళుతున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నలుగురికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో సంఘాల నేతలు మండిపడ్డారు. కలెక్టరేట్‌ ఎదుట రహదారిపై బైఠాయించారు.


నువ్‌ మోసగాడివన్నా.. మేము మోసపోయినామన్నా!

సీఎం తీరుపై పాటల రూపంలో అంగన్‌వాడీల నిరసన

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ‘నువ్‌ మోసగాడివన్నా.. మేము మోసపోయినామన్నా.. నువ్‌ ఇంటికి పోతావన్నా’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్‌వాడీ కార్యకర్తలు గీతాలు ఆలపించి నిరసన తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్‌ ఆవరణలో కొందరు కార్యకర్తలు, ఆయాలు పాటల రూపంలో తమ ఆవేదన వినిపించారు. ‘అందమైనవాడా.. చందమామలాంటి జగనన్నా.. నువ్‌ వచ్చినావని మురిసిపోతిమన్నా.. ఈ బండ కరిగిన కానీ, ఆ కొండ కరిగిన కానీ, నీ గుండె కరగదయ్యో.. నీ మనసు మారదయ్యో.. అన్నీ పెంచినావు.. మా జీతం పెంచలేవా? కరెంటు బిల్లు పెంచావు.. గ్యాసు బిల్లు పెంచి నోరు కొట్టినావు.. మా పొట్ట గొట్టినావు.. అంగన్‌వాడీలనూ నువ్వు ఆగం చేసినావు.. నువ్వు ఇంక రావు అయ్యో.. నువ్వు ఇంటికి పోతావయ్యో’ అంటూ ఆయాగా పనిచేసే ఖాసింబీ పాడటంతో మద్దతుగా అక్కడున్నవారంతా కరతాళ ధ్వనులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని