‘దారి’వ్వని ప్రభుత్వం!

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (నరేగా)లో మెటీరియల్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భవన నిర్మాణాలకే కేటాయించడంతో గ్రామీణ రహదారులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.

Updated : 07 Feb 2023 08:44 IST

‘మెటీరియల్‌’ నిధులన్నీ భవనాలకే కేటాయింపు
గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం
ప్రభుత్వ తీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోనూ అసహనం
ఈనాడు - అమరావతి

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (నరేగా)లో మెటీరియల్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భవన నిర్మాణాలకే కేటాయించడంతో గ్రామీణ రహదారులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కొత్త నిర్మాణాలకు నిధులు కేటాయించకపోవడంతో గతుకుల దారులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో సిమెంటు రహదారుల నిర్మాణంలో ఒకప్పుడు అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం చతికిలపడింది. ‘గడప గడపకు’ కార్యక్రమంలో పాల్గొంటున్న కొందరు ఎమ్మెల్యేలూ కొత్త రహదారులకు డబ్బుల్లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడలా... ఇప్పుడిలా

ఉపాధిహామీ పథకంలో మెటీరియల్‌ నిధులతో గత తెదేపా ప్రభుత్వం ఐదేళ్లలో గ్రామాల్లో 23,553 కిలోమీటర్ల సిమెంటు రహదారులు నిర్మించింది. ఇప్పుడు రోడ్లు వేసి కష్టాలు తీర్చండి మహాప్రభో అని ప్రజలు విజ్ఞాపనలు చేసుకునే దుస్థితి తలెత్తింది. గ్రామాల్లో కొత్త రహదారులు వేయడంతో పాటు ఉన్నవాటికి మరమ్మతులు చేయడం నిరంతర ప్రక్రియ. ఇందుకు గత ప్రభుత్వం నరేగా మెటీరియల్‌ నిధులను ఉపయోగించుకుంది. కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 34,652 గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్యకేంద్రాలు, పాల శీతలీకరణ కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీల భవన నిర్మాణాలకు రూ.8,953 కోట్లతో ప్రభుత్వం అనుమతులిచ్చింది.

రెండేళ్లుగా కొత్త రహదారుల పనులకు అనుమతుల్లేవు

నరేగాలో మెటీరియల్‌ నిధులతో గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు రెండేళ్లుగా పంపుతున్న ప్రతిపాదనలు కలెక్టర్ల స్థాయిలోనే నిలిచిపోతున్నాయి. మెటీరియల్‌ పనులకు కలెక్టర్ల నుంచి పరిపాలన అనుమతులు అవసరం. కొత్త పనులకు అనుమతులివ్వొద్దన్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఆదేశాలతో కలెక్టర్లు వీటిని పక్కన పెడుతున్నారు.


ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో రోడ్ల ఊసెత్తని సర్పంచులు

కేంద్రప్రభుత్వం పంచాయతీలకు కేటాయిస్తున్న ఆర్థికసంఘం నిధులను విద్యుత్తుఛార్జీల బకాయిల కింద రాష్ట్రప్రభుత్వం మళ్లించాక గ్రామాల్లో కొత్త రహదారుల పనులపై చాలాచోట్ల సర్పంచులు చేతులెత్తేశారు.

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై), ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సాయంతో చేస్తున్న పనులకు రాష్ట్రప్రభుత్వ వాటా నిధులు సమకూర్చడంలోనూ జాప్యమవుతోంది. దాదాపు రూ.150 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని