పోలవరం.. మరింత ఆలస్యం!
‘తాజాగా నిర్దేశించిన గడువు ప్రకారం పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి, పంపిణీ వ్యవస్థ (డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్) 2024 జూన్ నాటికి పూర్తికావాల్సి ఉంది.
రూ.2,390 కోట్ల బిల్లులకు చెల్లింపు అర్హత లేదు
గత అక్టోబరు నాటికి 78.99% పూర్తి
కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడూ వెల్లడి
ఈనాడు, దిల్లీ: ‘తాజాగా నిర్దేశించిన గడువు ప్రకారం పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి, పంపిణీ వ్యవస్థ (డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్) 2024 జూన్ నాటికి పూర్తికావాల్సి ఉంది. అయితే 2020, 2022ల్లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదల దృష్ట్యా ప్రతిపాదిత షెడ్యూల్‌లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది’ అని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడూ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.13,226 కోట్లు చెల్లించామని.. రూ.2,390 కోట్ల నిధులకు తిరిగి చెల్లించే అర్హత లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ గుర్తించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చుల చెల్లింపులో జాప్యం గురించి తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సోమవారం రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ‘2014 ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం చేసిన అర్హమైన ఖర్చులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోంది. బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదముద్ర వేసిన వెంటనే చెల్లిస్తున్నాం. 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.16,035.88 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అందులో ఇదివరకు పీపీఏకి కేటాయించిన మొత్తాన్ని మినహాయించి చెల్లింపునకు అర్హమైన రూ.13,226.04 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసింది. రూ.2,390.97 కోట్లకు తిరిగి చెల్లించే అర్హత లేదని పీపీఏ చెప్పింది. ఇవి కాకుండా రూ.548.38 కోట్ల బిల్లులు అథారిటీ పరిశీలన కోసం వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో ఖర్చుల తిరిగి చెల్లింపు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించే బిల్లులు, పీపీఏ, కేంద్ర జలసంఘం వాటిని పరిశీలించి చేసే సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్టులో స్పిల్‌వే, ఎగువ కాఫర్ డ్యాం, కాంక్రీట్ డ్యాం (గ్యాప్-3), ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ డయాఫ్రం వాల్ (గ్యాప్-1) నిర్మాణం పూర్తయ్యాయి. ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ (గ్యాప్ 1, 2) నిర్మాణం, నిర్వాసిత కుటుంబాలకు సహాయ పునరావాస కల్పన వివిధ దశల్లో ఉంది’ అని మంత్రి వివరించారు.
జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులివ్వం
పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టును ఏపీ జెన్‌కో నిర్మిస్తోందని, 2016-17 నాటి ధరల ప్రకారం దీనికి రూ.5,338.95 కోట్లు ఖర్చవుతుందని ఆ సంస్థ తెలిపిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్రాంటూ ఇవ్వదని స్పష్టం చేశారు. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఏపీ జెన్‌కో 960 మెగావాట్ల జలవిద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పునాది కోసం భూమి తవ్వకం పనులు పూర్తయినట్లు జెన్‌కో తెలిపింది. 2026 జనవరి నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం’ అని మంత్రి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!