సంక్షిప్త వార్తలు (17)

ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నూరు శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 07 Feb 2023 06:05 IST

ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నూరు శాతం అమలవ్వాలి
ప్రభుత్వం ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నూరు శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఈ ఏడాది జనవరి 1 నుంచి, మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో జనవరి 16 నుంచి ముఖ గుర్తింపు ఆధారిత హాజరును ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) రేవు ముత్యాలరాజు సోమవారం సర్క్యులర్‌ జారీ చేశారు. ఉద్యోగులంతా ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఎన్‌రోల్‌ కావాలని, యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలని చాలాసార్లు ఉత్తర్వులు జారీ చేసినా... ఆశించిన విధంగా ఆ ప్రక్రియ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉద్యోగులందరూ ఎన్‌రోల్‌ చేసుకునేలా చూడాలని కోరారు. ఎక్కడైనా అలా జరగకపోతే సంబంధిత కార్యాలయాల అధిపతులు, నోడల్‌ అధికారుల్నే బాధ్యుల్ని చేస్తామని స్పష్టంచేశారు.


ఛైర్మన్లు, డైరెక్టర్లు ప్రజలతో మమేకమవుతున్నారు

బీసీ సహకార ఆర్థిక సంస్థ ఎండీ అర్జునరావు వెల్లడి

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంపిక చేసేందుకుగాను బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని బీసీ సహకార ఆర్థిక సంస్థ ఎండీ అర్జునరావు పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్‌ కార్యాలయంలో నిర్వహించే బోర్డు సమావేశాలకు ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరవుతున్నారని వెల్లడించారు. ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘ఖాళీ కార్పొరేషన్లు’ శీర్షికన సోమవారం ప్రచురితమైన వార్తకు ఆయన వివరణ ఇచ్చారు.


క్షయ నిర్మూలనకు ఎస్‌బీఐ రూ.37.29 లక్షల విరాళం

వెయ్యి మంది రోగులకు ఆరు నెలల పాటు పౌష్టికాహారం

ఈనాడు, అమరావతి: ప్రధానమంత్రి టీబీ ముక్త్‌ అభియాన్‌ కార్యక్రమం కింద వెయ్యి మంది క్షయ రోగులను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దత్తత తీసుకుంది. ఆరు నెలల పాటు వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందజేయనుంది. దీని కోసం ఎస్‌బీఐ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.37.29 లక్షల విరాళాన్ని రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్‌ టు ఆంధ్రకు’ అందజేసింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కార్పొరేట్‌ సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి విరాళాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనెక్ట్‌ టు ఆంధ్రను ఏర్పాటు చేసింది. సోమవారం విజయవాడలోని ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌కుమార్‌ ఖారా చేతుల మీదుగా ‘కనెక్ట్‌ టు ఆంధ్ర’ సీనియర్‌ కన్సల్టెంట్‌ కె.బి.ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర టీబీ కార్యాలయం అధికారి కె.నాగరాజులకు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ సీజీఎం నవీన్‌ చంద్ర ఝా, జీఎంలు కె.గుండూరావు, కృష్ణశర్మ, ఓంనారాయణ్‌ శర్మ పాల్గొన్నారు. 2025 నాటికి భారత్‌లో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో చేపట్టిన ప్రధాన మంత్రి టీబీ ముక్త్‌ అభియాన్‌కు సహకారం అందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆ విరాళం అందజేసినట్టు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.


నల్సార్‌ విశ్వవిద్యాలయంతో ఇక్రిశాట్‌ ఒప్పందం  

ఈనాడు, హైదరాబాద్‌: ఆవిష్కరణల సాంకేతిక నిర్వహణ, మేథోసంపత్తి హక్కులు, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యీకరణ తదితర ప్రాజెక్టులపై కలిసి పనిచేసేందుకు నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంతో ఇక్రిశాట్‌ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. విశ్వవిద్యాలయ వీసీ కృష్ణదేవరావు, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ జాక్వెలిన్‌ హ్యుజెస్‌లు దీనిపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో నల్సార్‌ ప్రొఫెసర్‌ అనింద్యా సిర్కార్‌, ఇక్రిశాట్‌ న్యాయ సేవల విభాగాధిపతి సూర్యమణిత్రిపాఠి పాల్గొన్నారు.  


సీబీఏ పరీక్షలు నేటి నుంచి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తరగతి గది ఆధారిత అంచనా-2(సీబీఏ) పరీక్షలు మంగళవారం నుంచి పదో తేదీ వరకు జరగనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌లోని 1-5 తరగతులకు జిల్లా పరీక్షల విభాగం ప్రశ్నపత్రాలను అందిస్తుంది. 6-10 తరగతులకు సంబంధించిన అన్ని రకాల పాఠశాలలకు ప్రశ్నపత్రాలు అందిస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో 1-8 తరగతులకు ఓమ్మార్‌షీట్‌తో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలను 12వ తేదీలోపు మూల్యాంకనం పూర్తి చేసి, 14లోపు ఆన్‌లైన్‌లో మార్కులను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయులే మండల కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాలనే నిబంధన పెట్టారు. ఉపాధ్యాయులు ఉదయాన్నే పాఠశాలకు వచ్చి, ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వేసుకొని, మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను పాఠశాలలకు అందించాలని కోరుతున్నారు.


తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు నాలుగువేల వీడియో పాఠాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు నాలుగు వేల వీడియో పాఠాలను ఇంటర్‌ విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. జనరల్‌, వొకేషనల్‌తోపాటు సామాన్యశాస్త్రం ప్రయోగ పరీక్షల పాఠాలు, పరీక్షలకు సంబంధించిన టిప్స్‌, ప్రోత్సాహాన్ని ఇచ్చే  ప్రసంగాలను కూడా చేర్చింది. యూట్యూబ్‌లో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఈ-లెర్నింగ్‌ తెలంగాణ’ అని సెర్చ్‌ చేయాలని పేర్కొంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని వార్షిక పరీక్షలకు విద్యార్థులు మరింత సన్నద్ధం కావాలని శాఖ కమిషనర్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


13 నుంచి అగ్రి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2022-23 సంవత్సరానికి అగ్రి ఎమ్మెస్సీ (సామాజిక శాస్త్రం), ఎం.టెక్‌, ఎంబీఏ (ఏబీఎం) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్‌కు విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. 13న ఎంబీఏ కోర్సులో రెగ్యులర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాలో సీట్లకు బృంద చర్చ, ముఖాముఖి జరుగుతుందన్నారు. 14న ఎంబీఏ, ఫిజికల్‌ సైన్సెస్‌, బోటనీ బయో టెక్నాలజీ, వ్యవసాయ ఇంజినీరింగ్‌, సామాజిక శాస్త్రం, స్టాటికల్‌ సైన్సెస్‌, 15న అగ్రానమి, ప్లాంట్‌ సైన్సెస్‌, ఎంటమాలజీ, నెమటాలజీ, సోషల్‌ సైన్సెస్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ జరగనుందన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌  www.angrau.ac.in  ని చూడాలని సూచించారు.


చేతిరాత పోటీల్లో రాష్ట్ర విద్యార్థులకు అవార్డులు

ఈనాడు, అమరావతి: దేశవ్యాప్తంగా నిర్వహించిన చేతిరాత పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు అవార్డులు సాధించారని చేతిరాత శిక్షణదారుల సంఘం కార్యదర్శి మహబూబ్‌ హుసేన్‌ తెలిపారు. విజయవాడలో ఎనిమిదో తరగతి చదువుతున్న సేనాపతి జివితేష్‌కి నేషనల్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌, తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆలపాటి ప్రహార్షిక నేషనల్‌ ఎక్స్‌లెన్సీ బస్ట్‌ హ్యాండ్‌రైటింగ్‌, అవ్యక్తా ప్రద్యుమ్న పూజారికి మిస్‌ ఇండియా బెస్ట్‌ హ్యాండ్‌రైటింగ్‌ అవార్డులు లభించాయని వెల్లడించారు. ప్రపంచ కాలిగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 11న జరిగే అంతర్జాతీయ చేతిరాత పోటీలకు వీరు ఎంపికయ్యారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ పోటీల్లో 30లక్షల మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారని, జాతీయ స్థాయిలో ఎనిమిది అవార్డుల్లో మూడు రాష్ట్రానికి దక్కాయని పేర్కొన్నారు.


స్మార్ట్‌ డీవీ టెక్నాలజీస్‌లో పాలిటెక్నిక్‌ వారికి ఉద్యోగాలు: కమిషనర్‌

ఈనాడు, అమరావతి: స్మార్ట్‌ డీవీ టెక్నాలజీస్‌లో 600మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉద్యోగాలు లభించనున్నాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. చిత్తూరు జిల్లాలో జులైలో ప్రారంభించనున్న ఈ కంపెనీలో ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ విభాగాల్లో చివరి ఏడాది చదువుతున్న వారిని ఎంపిక చేయనున్నారని వెల్లడించారు. ఈ నెల 25న విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నామని, దీనికి విద్యార్థులను సిద్ధం చేసేందుకు అధ్యాపకులు కార్యాచరణ రూపొందించనున్నారని పేర్కొన్నారు.


స్వయం ప్రతిపత్తి కళాశాలలకు శాశ్వత గుర్తింపు

ఈనాడు, అమరావతి: స్వయం ప్రతిపత్తి గల కళాశాలలకు శాశ్వత అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. సాధారణ కళాశాలలకు ఐదు, పదేళ్లు గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. విజయవాడలో స్వయం ప్రతిపత్తి ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘పీజీ కోర్సుల అఫిలియేషన్‌ ఫీజు తగ్గింపును పరిశీలిస్తాం. అన్ని యూనివర్సిటీలకు ఒకే సర్వీసు ఫీజు ఉండేలా చూస్తాం. ఇంజినీరింగ్‌లో ఎక్కువగా ఐటీ కోర్సులే కాకుండా మెకానికల్‌, సివిల్‌ వంటివీ నిర్వహించాలి. అధ్యాపకులకు నిత్యం శిక్షణ ఇవ్వాలి. బీటెక్‌లో పెరుగుతున్న ప్రవేశాలకు అనుగుణంగా ప్రమాణాలు పెంచుకోవాలి. ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న పుస్తక సమీక్షలో విద్యార్థులు పాల్గొనేలా చూడాలి. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో లింక్డ్‌ ఇన్‌ ఖాతాలు తెరవడంతో వారిని ఆయా రాష్ట్రాలకు చెందిన వారిగానే పరిగణిస్తున్నారు. దీంతో నైపుణ్యం ఉన్నవారు ఇక్కడ లేనట్లే పరిశ్రమలు పరిగణిస్తున్నాయి. ఏటా 4లక్షల మంది అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తే ఇందులో 20శాతం మందికే ఉద్యోగాలు వస్తున్నట్లు నాస్కామ్‌ వెల్లడిస్తోంది’ అని ఆయన వివరించారు.


వక్ఫ్‌ భూములు హిందూజాకు అప్పగింత వెనుక అక్రమాలు

సీఈవోను విచారించాలని గవర్నర్‌ కార్యాలయానికి ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖ జిల్లా దేవాడ గ్రామంలోని మదాని ఔలియా దర్గాకు చెందిన 20.25 ఎకరాల వక్ఫ్‌ భూముల్లో బూడిద నింపేందుకు హిందూజా కంపెనీకి ఉచితంగా కట్టబెట్టడం వెనుక భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌ జిల్లా సిద్ధవటానికి చెందిన సయ్యద్‌ షా షబ్బీర్‌ ఆలం ఖాద్రీ గవర్నర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. వక్ఫ్‌బోర్డు ఆమోదం లేకుండా సీఈవో అబ్దుల్‌ ఖాదీర్‌ అనుమతిచ్చి నిబంధనల్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఇదేకాకుండా వక్ఫ్‌బోర్డులో 15 మంది సిబ్బంది నియామకానికి సంబంధించి అక్రమాలు చోటు చేసుకున్నాయని, గుంటూరు జిల్లాలోని ఓ గ్రామం నుంచే ఆ 15 మందిని నియమించారని తెలిపారు. కర్నూలు జిల్లా దిన్నేదేవరపాడు గ్రామంలోని 7.50 ఎకరాల వక్ఫ్‌భూమికి సంబంధించి ఆక్రమణదారులకు అనుకూలంగా ఎన్‌వోసీ జారీ చేశారని, చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ గ్రామంలోని మసీదుకు చెందిన వక్ఫ్‌భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అడ్డుకోలేదని, వీటి వెనుక భారీ ఎత్తున అవినీతి జరిగిందని వెల్లడించారు. వీటితోపాటు మరో రెండు అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిన్నింటిపై విచారణ చేపట్టాలని మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ను గవర్నర్‌ కార్యాలయం ఆదేశించినట్లు తెలిసింది.


పీజీ వైద్య విద్యలో వసతుల కల్పనకు రూ.756 కోట్లు

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రాయోజిత పథకం కింద పీజీ వైద్య విద్యలో అదనంగా కేటాయించిన 630 సీట్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.756 కోట్లు ఖర్చుపెట్టేందుకు పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 688 వైద్య సీట్ల కోసం ప్రతిపాదనలు పంపగా.. కేంద్రం 630 సీట్లకు అంగీకారం తెలిపింది. కేటాయించిన మొత్తంతో సంబంధిత వైద్య కళాశాలల్లో ల్యాబ్‌, తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రతిపాదించిన మొత్తంలో కేంద్రం రూ.453.6 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.302.4 కోట్ల చొప్పున భరిస్తాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాలకు పీజీ వైద్య విద్యలో అదనంగా 128 సీట్లు, ఒంగోలు కళాశాల-79, తిరుపతి-75, విజయవాడ-71, కడప-69, అనంతపురం-65, కాకినాడ-46, కర్నూలు-41, గుంటూరు కళాశాలకు 34 చొప్పున, శ్రీకాకుళం, నెల్లూరు వైద్య కళాశాలలకు మిగిలిన సీట్లు కేటాయింపు జరిగినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.


అగ్నిమాపక శాఖలో అదనపు డైరెక్టర్ల నియామకం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ప్రాంతీయ అధికారులు (ఆర్‌ఎఫ్‌వో)గా పనిచేస్తున్న ముగ్గురికి అదనపు డైరెక్టర్లుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఉత్తర జోన్‌ అదనపు డైరెక్టర్‌గా జి.శ్రీనివాసులు, దక్షిణ జోన్‌కు ఆర్‌.జ్ఞానసుందరం, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగానికి టి.ఉదయ్‌కుమార్‌ను నియమించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్‌ గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.


నర్సింగ్‌లో ఉపాధి అవకాశాలకు తక్త్‌తో ఒప్పందం

ఈనాడు, అమరావతి: నర్సింగ్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో అంతర్జాతీయ నియామకాల కోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీఎన్‌ఆర్టీ సంయుక్తగా తక్త్‌ ఇంటర్నేషనల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తక్త్‌ సంస్థ నర్సింగ్‌ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించి, ఎంపికైన వారికి జర్మనీలో అవకాశాలు కల్పిస్తోంది. నర్సులుగా పని చేయాలనుకుంటున్న వారికి తక్త్‌ ద్వారా అవకాశాలు లభిస్తాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ వెల్లడించింది. మూడు నెలలపాటు జర్మన్‌ భాషపై శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో సంస్థ జీతం ఇవ్వదు. శిక్షణ పూర్తయ్యాక జర్మనీలో ఉపాధి కల్పిస్తారని వెల్లడించింది. ఈ ఒప్పందంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణ, ఈడీ శ్రీనివాసులు, ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు వెంకట్‌ మేడపాటి, తక్త్‌ సంస్థ ఎండీ రాజ్‌సింగ్‌ పాల్గొన్నారు.


పీటీడీ ఉద్యోగుల బకాయిల అప్‌లోడ్‌కు ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగులకు చెందిన 8 నెలల పీఆర్సీ బకాయిలను లెక్కించి, అప్‌లోడ్‌ చేయాలని ఆర్టీసీ ఈడీ (పరిపాలన) కోటేశ్వరరావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు గత ఏడాది జనవరి నుంచి పీఆర్సీ అమలు చేయగా, పీటీడీ ఉద్యోగులకు మాత్రం గత జూన్‌లో ఉత్తర్వులిచ్చి, సెప్టెంబరు నుంచి అమలు చేస్తున్నారు. దీంతో గత జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల పీఆర్సీ బకాయిలను.. పేరోల్స్‌ మాడ్యూల్స్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా లెక్కించి, సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లుల కోసం అప్‌లోడ్‌చేయాలని ఆ శాఖ డీడీవోలను ఆదేశించారు.


రెడీమేడ్‌ దుస్తుల తయారీదారులకు ఆప్కో ఆహ్వానం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రెడీమేడ్‌ దుస్తులు కుట్టే ఆసక్తి కలిగిన ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆప్కో ఎండీ ఎం.ఎం. నాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల రెడీమేడ్‌ వస్త్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 11వ తేదీలోపు విజయవాడలోని ఆప్కో కార్యాలయం పేరుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


ఆదర్శ పాఠశాలల సిబ్బంది పదవీవిరమణ వయసు పెంపు!

ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల సొసైటీల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది పదవీవిరమణ వయసును 62ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. పదవీవిరమణ వయసు పెంపు ప్రతిపాదనను కేబినెట్‌ ఎజెండాలో చేర్చాలని విద్యాశాఖను సీఎం ఆదేశించారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని