Madras High Court: ఉమ్మడి స్థలం ఫ్లాట్ల యజమానులదే

అపార్ట్‌మెంట్లో ఫ్లాట్లు అమ్ముకున్నాక రకరకాల కిరికిరులు పెట్టి వాటి యజమానుల హక్కులను హరించే బిల్డర్లకు షాకిచ్చేలా మద్రాసు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Updated : 07 Feb 2023 08:03 IST

బిల్డర్‌కు దానిపై హక్కు ఉండదు  
తేల్చిచెప్పిన మద్రాసు హైకోర్టు
కీలక తీర్పు వెలువరించిన న్యాయస్థానం  

ఈనాడు, అమరావతి: అపార్ట్‌మెంట్లో ఫ్లాట్లు అమ్ముకున్నాక రకరకాల కిరికిరులు పెట్టి వాటి యజమానుల హక్కులను హరించే బిల్డర్లకు షాకిచ్చేలా మద్రాసు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అపార్ట్‌మెంట్‌లోని ఉమ్మడి స్థలం (కామన్‌ ఏరియా), అందులో అభివృద్ధి చేసిన సౌకర్యాలు.. ఫ్లాట్ల యజమానులకే చెందుతాయని తేల్చిచెప్పింది. వాటిపై బిల్డర్‌కు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని స్పష్టం చేసింది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుబ్రమణియన్‌, జస్టిస్‌ కె.కుమారేశ్‌బాబుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది. చెన్నై ఆళ్వార్‌పేటలోని ఓ స్థలంలో 2001లో రమణీయం రియల్‌ ఎస్టేట్‌ సంస్థ (బిల్డర్‌) 77 ఫ్లాట్లు నిర్మించి విక్రయించింది. దీంతోపాటు ఉమ్మడి స్థలంలో నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ (ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌) భవనాన్ని నిర్మించి తానే యజమానిగా పేర్కొంటూ ఓ వ్యక్తికి అమ్మేసింది. దీనిపై అబోట్స్‌బరీ ఓనర్ల అసోసియేషన్‌ (ఏఓఏ) హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ప్లానింగ్‌ అనుమతులను ఉల్లంఘిస్తూ నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ నిర్మాణాన్ని వినియోగిస్తున్నారని పేర్కొంది. అపార్ట్‌మెంట్‌వాసుల ఉమ్మడి సౌకర్యాల కోసం దానిని ఉద్దేశించారని వివరించింది. దానిపై ఫ్లాట్ల యజమానులకే హక్కు ఉంటుందని తెలిపింది. నిర్మాణ సంస్థ వాదనలు వినిపిస్తూ.. నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ ఉమ్మడి ప్రాంతం కిందకు రాదని తెలిపింది. భూమి విలువకట్టే సమయంలో లేదా భవన నిర్మాణ విషయంలో నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ ప్రాంతానికి ఎలాంటి సొమ్ము వసూలు చేయలేదని తెలిపింది. మొత్తం నిర్మాణ ప్రాంతం 1.30 లక్షల చదరపు అడుగులకు బదులు పొరపాటున 2 లక్షల చదరపు అడుగులుగా పేర్కొన్నామని తెలిపింది.


బిల్డర్‌ తప్పుచేశారు: ధర్మాసనం

ధర్మాసనం.. బిల్డర్‌ వ్యవహార శైలిని తప్పుపట్టింది. ‘‘బిల్డప్‌ ప్రాంతాన్ని 2 లక్షల చదరపు అడుగులుగా కృత్రిమంగా పెంచుతూ ఫ్లాట్ల యజమానులకు ఉమ్మడి భూమిలో వాటా ఉండదని పేర్కొనడంలో అర్థం లేదు. అవిభాజ్య వాటాకు సొమ్ము చెల్లించలేదనే బిల్డర్‌ వాదనతో ఏకీభవించలేం. భూమికి, భవనానికి ఏ ప్రమోటరూ వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేయలేరు. ఉదాహరణకు ఎవరైనా 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్‌ను కొంటే దానికి భూమి విలువతోపాటు భవనం విలువను లెక్కకట్టే వసూలు చేస్తారు. ప్రస్తుత కేసులో బిల్డర్‌ ఉద్దేశపూర్వకంగానే తప్పు చేశారు. అన్‌ డివైడ్‌ షేర్‌ విషయంలో అదనపు సొమ్ము చెల్లించాలన్న బిల్డర్‌ అభ్యర్థన సరికాదు. స్థలం ఒకసారి కామన్‌ ఏరియా, కామన్‌ సౌకర్యాల అభివృద్ధి కోసం అని పేర్కొన్నాక ఆ భూమి ఫ్లాట్ల యజమానులకే చెందుతుంది. అవిభాజ్య వాటాను మదింపు చేయడంలో పొరపాటు జరిగి ఉంటే దానిని సవరించాల్సింది బిల్డరే. అవిభాజ్య వాటాలో ఫ్లాట్ల యజమానులందరికి హక్కు దఖలు పడేలా ‘సవరించిన దస్త్రాలు’ రాసి ఇవ్వాలని బిల్డర్‌ను ఆదేశిస్తున్నాం. నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ ఖాళీ భవనాన్ని తక్షణమే ఫ్లాట్ల యజమానుల సంఘానికి అప్పగించాలని చెన్నై మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీని ఆదేశిస్తున్నాం’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని