కాపులకు 5% రిజర్వేషన్‌ అమలు చేసేలా ఆదేశించండి

కాపులకు 5% రిజర్వేషన్‌ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

Updated : 07 Feb 2023 04:59 IST

హైకోర్టులో హరిరామజోగయ్య వ్యాజ్యం
సీఎంని ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరం
పేరు తొలగిస్తానన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది

ఈనాడు, అమరావతి: కాపులకు 5% రిజర్వేషన్‌ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కేంద్రం కేటాయించిన 10% రిజర్వేషన్లలో... కాపులకు 5% కేటాయిస్తూ మాజీ సీఎం చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి పేరును ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలుపుతూ నంబరు కేటాయించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ... ‘కాపులకు రిజర్వేషన్‌ కల్పించే వ్యవహారాన్ని వైకాపా మ్యానిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జీవోను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నాం’ అని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ... మ్యానిఫెస్టో అంశాల అమలుకు న్యాయస్థానాలు ఆదేశించలేవన్నారు. దీంతో న్యాయవాది స్పందిస్తూ.. ముఖ్యమంత్రి పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... వ్యాజ్యానికి నంబరు కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని