జైల్లో ఉన్న వ్యక్తిపై దారి దోపిడీ కేసా?

హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉన్న వ్యక్తిపై దారిదోపిడీ కేసు పెట్టి, ఛార్జిషీటు దాఖలు చేసిన కాకుమాను ఎస్సై రవీంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.రాంగోపాల్‌ ఉత్తర్వులు జారీచేశారు.

Updated : 07 Feb 2023 04:48 IST

ఎస్సైపై చర్య తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశం

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉన్న వ్యక్తిపై దారిదోపిడీ కేసు పెట్టి, ఛార్జిషీటు దాఖలు చేసిన కాకుమాను ఎస్సై రవీంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.రాంగోపాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. 2016 మార్చి 7న చల్లా రమణారెడ్డి బ్రాహ్మణపల్లి నుంచి పిడుగురాళ్లకు వెళ్తున్నారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని అతన్ని అడ్డగించి బంగారు ఉంగరం, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణలో ఇద్దరు మైనర్లతో పాటు పిడుగురాళ్లకు చెందిన పఠాన్‌ రబ్బాని, కంపా కనకారావు, ఖాజామొహీద్దీన్‌, నల్లబోతుల గోపాల్‌, షేక్‌ షరీఫ్‌లు ఈ నేరానికి పాల్పడినట్లుగా గుర్తించి, వారి నుంచి దొంగిలించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అప్పటి పిడుగురాళ్ల ఎస్సై డి.రవీంద్రబాబు పేర్కొన్నారు. నిందితుడిగా పేర్కొన్న పఠాన్‌ రబ్బాని అప్పటికే అదే పోలీస్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దోపిడీ జరిగిన సమయంలో రబ్బాని రిమాండ్‌ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఈ కేసు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. సాక్ష్యం నిరూపించకపోవడంతో గతేడాది నవంబర్‌ 23న న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. విచారణ సమయంలో రిమాండ్‌లో ఉన్న పఠాన్‌ రబ్బానిపై దారిదోపిడీ కేసు నమోదు చేసినట్లుగా న్యాయమూర్తి గుర్తించారు. జైల్లో ఉన్న వ్యక్తి దారి దోపిడీకి ఎలా పాల్పడతాడంటూ న్యాయమూర్తి ప్రస్తుతం కాకుమానులో ఎస్సైగా పనిచేస్తున్న రవీంద్రబాబుకు అప్పట్లోనే షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు కూడా  ఆదేశించారు. రవీంద్రబాబు సోమవారం కోర్టుకు హాజరై న్యాయమూర్తికి వివరణ ఇచ్చారు. నిందితులు నేరం అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలం మేరకు రబ్బానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేసే విధానం ఇదేనా? ఇష్టమొచ్చినట్లు నమోదు చేస్తారా? నిందితుల వాంగ్మూలానికి విలువ ఎంత? దానిని పరిశీలించరా? అని ప్రశ్నించారు. దీనిపై సమాధానం తెలిపేందుకు ఎస్సై సమయం కోరడంతో విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని