రాంగ్‌కాల్‌ కలిపింది.. రాంగ్‌రూట్‌ పట్టించింది

రాంగ్‌కాల్‌ ద్వారా పరిచయమైన ఓ మహిళను పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా దేశంలోకి చొరబడిన పాకిస్థాన్‌ పౌరుడు.. తొమ్మిదేళ్లు ఆమెతో సహజీవనం చేసి, నలుగురు పిల్లలను కని పారిపోయే క్రమంలో పట్టుబడ్డాడు.

Published : 07 Feb 2023 03:55 IST

నంద్యాల మహిళ కోసం అక్రమంగా భారత్‌లోకి చొరబడిన పాకిస్థానీ  
పెళ్లి.. నలుగురు పిల్లలు.. తిరిగి స్వదేశానికి వెళ్లే క్రమంలో అరెస్టు  

గడివేముల, న్యూస్‌టుడే: రాంగ్‌కాల్‌ ద్వారా పరిచయమైన ఓ మహిళను పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా దేశంలోకి చొరబడిన పాకిస్థాన్‌ పౌరుడు.. తొమ్మిదేళ్లు ఆమెతో సహజీవనం చేసి, నలుగురు పిల్లలను కని పారిపోయే క్రమంలో పట్టుబడ్డాడు. నేడు అతడు జైలులో ఉండగా, పిల్లల పోషణ భారం మోయలేక ఆ మహిళ దీనంగా అర్థిస్తోంది. నంద్యాల జిల్లా గడివేములకు చెందిన షేక్‌ దౌలత్‌బీకి పెళ్లయిన ఏడేళ్ల తర్వాత భర్త చనిపోయాడు. అప్పటికే వారికి ఓ కుమారుడున్నాడు. భర్త మరణించాక దౌలత్‌బీ తల్లిదండ్రుల వద్దకు చేరింది.

2010లో ఆమె ఫోన్‌కు ఓ కాల్‌ వచ్చింది. అలా పాకిస్థాన్‌ పౌరుడైన గుల్జార్‌ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. అక్కడి పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన గుల్జార్‌ సౌదీ అరేబియాలో పెయింటర్‌గా పనిచేసేవాడు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. దౌలత్‌బీని కలిసేందుకని గుల్జార్‌ఖాన్‌ సౌదీ నుంచి ముంబయి మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. నేరుగా గడివేములకు వచ్చి 2011 జనవరి 25న దౌలత్‌బీతో నిఖా చేసుకున్నాడు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగారు. తొమ్మిదేళ్ల పాటు సంసారం సాఫీగానే సాగింది. గుల్జార్‌ గడివేములలో ఆధార్‌కార్డు పొందాడు. దాని ఆధారంగా తనతో పాటు భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లేందుకు వీసాలు తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌ వెళ్లాలన్నది వారి ప్రణాళిక. 2019లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాగా, తనిఖీ సిబ్బంది పరిశీలనలో గుల్జార్‌ఖాన్‌ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఐదుగురు సంతానం.. తెగిన ఆధారం

అలా ఎయిర్‌పోర్టులో భర్త దూరమై.. పిల్లలతో సహా స్వస్థలానికి తిరిగొచ్చిన దౌలత్‌బీ సంసారం నెట్టుకురాలేక సతమతమవుతోంది. తన ఐదుగురు సంతానంతో పాటు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న సోదరి పోషణ భారం ఆమెపైనే పడింది. ఇళ్లల్లో పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహమ్మద్‌ ఇలియాస్‌ కూలీ పనులకు వెళ్తుండగా, మిగిలిన వారంతా పదేళ్లలోపు చిన్నారులే. గుల్జార్‌ఖాన్‌ అరెస్టయిన ఆరు నెలల తర్వాత కరోనా కారణంగా జైలు నుంచి విడుదలయ్యాడు. ఏడాది పాటు భార్య పిల్లలతో కలిసున్నాడు. 2022లో మళ్లీ హైదరాబాద్‌లోని జైలుకు తరలించారు. ఆమె తన భర్తను విడుదల చేయాలని అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని