టెండర్లకు స్పందన కరవు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని ఆసుపత్రుల్లో రోగులకు భోజనం (డైట్‌) అందించేందుకు పిలుస్తున్న టెండర్లకు స్పందన కనిపించడం లేదు. ఒకటి, రెండు సార్లు పిలవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.

Updated : 07 Feb 2023 05:54 IST

ఆసుపత్రుల్లో ‘డైట్‌’ సరఫరాకు ముందుకురాని గుత్తేదారులు

ఈనాడు-అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని ఆసుపత్రుల్లో రోగులకు భోజనం (డైట్‌) అందించేందుకు పిలుస్తున్న టెండర్లకు స్పందన కనిపించడం లేదు. ఒకటి, రెండు సార్లు పిలవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లా, ప్రాంతీయ, సామాజిక, మాతా, శిశు, తదితరాల కింద కలిపి మొత్తం 246 ఆసుపత్రులు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని చోట్ల స్పందన లేదు. ఇంకొన్నిచోట్ల ఒక దరఖాస్తు మాత్రమే రావడంతో మరోసారి పిలుస్తున్నారు. ఇటీవల ఒక్కో రోగి డైట్‌ ఛార్జీలను రూ.40 నుంచి రూ.80కి పెంచారు. దీనికనుగుణంగా టెండర్లను ఆహ్వానించారు. అయినా గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఆయా ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 30 నుంచి 50 మధ్యన ఉండడంతో గిట్టుబాటు కాదన్న భావనతో టెండర్లు వేయడం లేదు. సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగవన్న ఆందోళన కూడా ఉంది.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి

కాకినాడ జిల్లా  ప్రత్తిపాడు, పెద్దపూడిల్లో ఒక్కటీ రాలేదు. జగ్గంపేట, పిఠాపురం ఆసుపత్రులకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. మరోసారి టెండర్లు పిలిచారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం, విసన్నపేటల్లో ఒక్కరూ వేయలేదు. నందిగామ ఆసుపత్రికి ఒకటే రావడంతో రద్దు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 15 ఆసుపత్రుల్లో, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జిల్లా అమలాపురం, రాజోలు, ఇతర మరికొన్ని సీహెచ్‌సీల్లో తొలివిడత స్పందన కనిపించలేదు. తూర్పుగోదావరి, తిరుపతి, నెల్లూరు, ఇతర జిల్లాలో గుత్తేదారుల ఎంపిక చివరి దశలో ఉందని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఒకే సంస్థ ద్వారా నాలుగైదు ఆసుపత్రులకు దరఖాస్తులు వస్తున్నాయి. అయితే... ఈ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, మార్చి ఒకటి నుంచి కొత్త డైట్‌ ఛార్జీల ప్రకారం రోగులకు ఆహార సరఫరా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

బోధనాసుపత్రుల్లో పోటాపోటీ

బోధనాసుపత్రుల్లోని టెండర్లకు గుత్తేదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దక్కించుకునేందుకు ఎవరికీ వారు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీటిల్లో స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటున్నందున నిత్యం వందల సంఖ్యలో ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ జీజీహెచ్‌లో టెండర్‌ దక్కించుకోవడానికి పెద్దఎత్తున లాబీయింగ్‌ జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు