నిలిచిన ఎయిర్‌ కార్గో సేవలు

రాష్ట్రంలో కీలకమైన విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల నుంచి ‘ఎయిర్‌ కార్గో(సరకుల రవాణా) సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా పలు రంగాలకు అవస్థలు తప్పడం లేదు.

Published : 07 Feb 2023 05:10 IST

విశాఖ, విజయవాడతో పాటు మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి
నెల రోజులుగా ఔషధాలు, రొయ్య పిల్లల ఎగుమతికి అవస్థలు

ఈనాడు, విశాఖపట్నం : రాష్ట్రంలో కీలకమైన విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల నుంచి ‘ఎయిర్‌ కార్గో(సరకుల రవాణా) సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా పలు రంగాలకు అవస్థలు తప్పడం లేదు. నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఈ సేవల పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కార్గో సేవలకు 2023 జనవరి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అంతకుముందు సంబంధిత విమానయాన సంస్థలే కార్గో తనిఖీలు, స్క్రీనింగ్‌ పరీక్షలు చేపట్టేవి. రవాణా సరకుల్లో ప్రమాదకర, మండే స్వభావం కలిగినవి ఏమైనా ఉన్నాయా? వంటి తనిఖీలను నైపుణ్యం కలిగిన సిబ్బందితో నిర్వహించేవి. పరిశీలనలో పూర్తిస్థాయి బాధ్యత ఆ సంస్థలదే. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) నిబంధనల ప్రకారం భారత విమానయాన ప్రాథికార సంస్థ (ఏఏఐ) ఆధ్వర్యంలోనే ఈ తనిఖీలు జరగాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 31తో ఆయా విమానయాన సంస్థలు కార్గో తనిఖీ సేవల నుంచి విరమించుకున్నాయి. ఈ ఉత్తర్వులపై పది నెలల కిందటే దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఏఏఐ సమాచారం ఇచ్చింది. కొన్ని విమానాశ్రయాలు ముందుగానే మేల్కొని అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాయి. రాష్ట్రంలోని అత్యధిక కార్గో సేవలు నిర్వహించే విశాఖ విమానాశ్రయంలో తగు ఏర్పాట్లు చేయలేదు. ఒడిశాలోని భువనేశ్వర్‌లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉన్నట్లు సమాచారం. కార్గో తనిఖీలకు ఏఏఐ అవసరమైన సిబ్బందిని నియమించాలి. వారికి తగిన శిక్షణ అందించాలి. స్క్రీనింగ్‌ యంత్రాలను కొనుగోలు చేయాలి. ఇవేమీ చేయకపోవడంతో తనిఖీల ప్రక్రియ జరగక ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఆక్వా, ఔషధ, బంగారం, వజ్రాల వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు రోగుల నుంచి రక్త, బయాప్సీ నమూనాలు తీసి ముంబయి, అహ్మదాబాద్‌, చెన్నై, పుణెలోని ప్రయోగశాలలకు పంపిస్తుంటాయి. అవన్నీ దాదాపుగా ఎయిర్‌ కార్గో ద్వారానే వెళతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపుతుండటంతో రక్త నమూనాల ఫలితాలు ఆలస్యమవుతున్నాయి.

రోడ్డు మార్గంలో...

విశాఖ కేంద్రంగా ఎయిర్‌ కార్గో ద్వారా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి నిలిచిపోవడంతో ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాలకు రోడ్డు మార్గంలో పంపిస్తున్నారు. ప్రస్తుతం రొయ్య పిల్లల ఎగుమతికి అనుకూల కాలం. జనవరి నుంచి ఆగస్టు వరకు వందల టన్నుల రొయ్య పిల్లలను ఎగుమతి చేస్తారు. డిమాండు సమయంలో సేవలు కొనసాగక పోవడంతో ఆ రంగానికి చెందిన వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. విశాఖకు చెందిన ఓ ఆక్వా సంస్థ రోజుకు అయిదు టన్నుల రొయ్య పిల్లలను ఎగుమతి చేస్తుంది. ఇందుకోసం రూ.5 లక్షలు కార్గో ఛార్జీలు చెల్లిస్తుంది. ఇప్పుడు రోడ్డు మార్గాన పంపించాల్సి వస్తోంది.  అచ్యుతాపురం, పరవాడ సెజ్‌లలోని ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే ఔషధాల ఎగుమతులకూ ఇబ్బందులు తప్పటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని ఏఏఐతో మాట్లాడతామని ఎంపీ, విశాఖపట్నం విమానాశ్రయ సలహా మండలి అధ్యక్షుడు ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని