నిలిచిన గిరిజన ఉప ప్రణాళిక నిధులు

నిధుల వినియోగ ధ్రువపత్రాలను (యూసీ) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సకాలంలో సమర్పించకపోవడంతోనే గిరిజన ఉప ప్రణాళికకు నిధుల విడుదల నిలిచిపోయిందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకసింగ్‌ సరుతా తెలిపారు.

Updated : 07 Feb 2023 05:59 IST

యూసీలు సమర్పించకపోవడమే కారణం

ఈనాడు, దిల్లీ: నిధుల వినియోగ ధ్రువపత్రాలను (యూసీ) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సకాలంలో సమర్పించకపోవడంతోనే గిరిజన ఉప ప్రణాళికకు నిధుల విడుదల నిలిచిపోయిందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకసింగ్‌ సరుతా తెలిపారు. కాకినాడ ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు 2019-20లో రూ.124.70 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.37.42 కోట్లకు మాత్రమే యూసీలు సమర్పించింది. 2020-21లో రూ.49.54 కోట్లు మంజూరు చేయగా ఒక్క రూపాయికి యూసీలు ఇవ్వలేదు. గతంలో విడుదల చేసిన నిధులకు యూసీలు సమర్పించనందున 2021-22 సంవత్సరానికి నిధులు పెండింగ్‌లో పెట్టాం’ అని మంత్రి స్పష్టంచేశారు.

రాష్ట్ర విభజన అనంతరం తిరుపతిలో భారతీయ పాకశాస్త్ర సంస్థ(ఐసీఐ) ఏర్పాటు చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తిరుపతి ఐసీఐలో పాకశాస్త్రానికి సంబంధించిన గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ఉన్నాయన్నారు. ఐసీఐతోపాటు తిరుపతి, కాకినాడలకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రాష్ట్రస్థాయి సంస్థలు, నెల్లూరుకు భారతీయ పర్యాటక, రవాణా నిర్వహణ సంస్థను (ఐఐటీటీఎం) మంజూరు చేశామన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అడిగిన ప్రశ్నకు... కొండపల్లి కోట నిర్వహణ, అభివృద్ధి కోసం వారసత్వ స్థలాల దత్తత పథకానికి ప్రతిపాదనలేమీ అందలేదని, ఇదే పథకం కింద గండికోట నిర్వహణకు దాల్మియా భారత్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

జీఎస్టీ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన నిధుల్లో రూ.689 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, పరిహార నిధి నుంచి త్వరలోనే వాటిని విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

సమగ్ర శిక్ష అభియాన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో రూ.869.75 కోట్లు, 2021-22లో రూ.683.01 కోట్లు, 2022-23 ఫిబ్రవరి 1నాటికి రూ.867.40 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి తెలిపారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని