రైల్వే ప్రాజెక్టులపై కేంద్రానివి సాకులు

రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం తన వాటా ఇవ్వడం లేదని కేంద్రం సాకులు చెబుతోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు.

Updated : 07 Feb 2023 06:16 IST

వైకాపా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

ఈనాడు, దిల్లీ: రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం తన వాటా ఇవ్వడం లేదని కేంద్రం సాకులు చెబుతోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. దిల్లీ ఏపీ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైల్వేపరంగా బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.8,500 కోట్లు కేటాయించామని చూపుతున్నారని, వాటిని ఏవిధంగా ఖర్చు చేస్తారో సవివరంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం వైపు నుంచి భూసేకరణకు డబ్బులివ్వడం లేదని రైల్వేశాఖ సాకులు చెబుతోందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రంతో చర్చించి రాష్ట్ర వాటా విషయంలో మార్పులు చేయాలని సూచిస్తామన్నారు. పార్లమెంటులో ఈ అంశంపై గట్టిగా ప్రశ్నిస్తామన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య 2014కు ముందు కుదిరిన ఒప్పందాన్నే ఇప్పుడూ కొనసాగించాలనడం సరికాదన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తితిదే బ్రహ్మోత్సవాల క్యాలెండర్‌ను జాతీయ ఉత్సవ పోర్టల్‌, జాతీయ పర్యాటక క్యాలెండర్‌లో చూపడం లేదని.. తమ విజ్ఞప్తి మేరకు మొన్ననే ఉత్సవ పోర్టల్‌లో చేర్చారని అన్నారు. శ్రీకాళహస్తి, కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలనూ ఉత్సవ పోర్టల్‌లో చూపాలని కోరామని అన్నారు. తిరుపతిలో రూ.13 కోట్లతో ప్లానిటోరియం ఏర్పాటుచేస్తామని కేంద్రం తెలిపిందని వివరించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆహార ప్రయోగశాల ఏర్పాటుకు రూ.10 కోట్లు, మహిళా విశ్వవిద్యాలయంలో మరో ప్రాజెక్టుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. తిరుపతి స్విమ్స్‌లో క్యాన్సర్‌ పరికరాల కొనుగోలుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సామాజిక బాధ్యత పథకం (సీఎస్‌ఆర్‌) కింద రూ.22 కోట్లు కేటాయించిందని వివరించారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులకు కేవలం రూ.220 కోట్లు మాత్రమే మంజూరు చేశారని, ఎక్కువ నిధులకు ఒత్తిడి తెస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని