చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

Published : 07 Feb 2023 05:10 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, విశాఖపట్నం: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. జాతీయ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధులకు మూడు రోజులుగా విశాఖలో జరుగుతున్న కార్యశాలలో సోమవారం ‘షీ ఈజ్‌ ఏ ఛేంజ్‌ మేకర్‌’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో మహిళల సంఖ్య మరింత పెరగాలి. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించినా... లోక్‌సభలో కొన్ని పార్టీలు అడ్డుకున్నాయి. అందుకు గల కారణాలను ఆయా పార్టీలే విశ్లేషించుకోవాలి. దీనిపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే త్వరలో అవి ఈ బిల్లును తీసుకురావాలి...’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అవినీతి, లింగ వివక్షత, వరకట్నం, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో మహిళలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి, సమాజాభివృద్ధిలో మహిళా నేతలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని వెంకయ్యనాయుడు చెప్పారు. మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ పేర్కొన్నారు. చట్టాల రూపకల్పనలో మహిళలు కీలకంగా వ్యవహరించాలన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల్లో సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ పరిపాలన సంస్థ ఉప సంచాలకులు దిశా పన్ను, వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని