ఈ రోడ్లు.. నరకానికి నకళ్లు

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. మారుమూల పల్లెల నుంచి ప్రధాన పట్టణాల వరకు అన్ని చోట్లా మట్టి రోడ్డు కన్నా అధ్వానంగా మారిన రోడ్లు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.

Updated : 08 Feb 2023 09:48 IST

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అధ్వానంగా రహదారులు
కనీస మరమ్మతులూ కరవై ప్రజలకు నిత్యం యాతనే

ఈనాడు డిజిటల్‌- ఏలూరు, న్యూస్‌టుడే బృందం: ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. మారుమూల పల్లెల నుంచి ప్రధాన పట్టణాల వరకు అన్ని చోట్లా మట్టి రోడ్డు కన్నా అధ్వానంగా మారిన రోడ్లు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. చాలారోడ్లు దశాబ్దకాలంగా కనీస మరమ్మతులకూ నోచుకోలేదు. అరకొరగా బాగుచేసినవీ వర్షాలకు ఊడ్చిపెట్టుకుపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 3,507 కి.మీ. రహదారుల్లో దాదాపు 70 శాతం దారులు ఛిద్రమయ్యాయి. వీటిపై ప్రయాణికులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాలు పాడవడంతో ఆర్థిక భారమూ తప్పడం లేదు. తాడేపల్లిగూడెం- భీమవరం, ఏలూరు- జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కైకలూరు, గణపవరం- భీమవరం, ఉండి- సీసలి రహదారులు దారుణంగా ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారులు ఎక్కువ శాతం కాలువ గట్ల పక్కన ఉన్నాయి. నల్లమట్టి ఎక్కువగా ఉండటంతో వర్షాలు కురిసినప్పుడు రోడ్డు కింద మట్టి కొట్టుకుపోయి త్వరగా కుంగిపోతోంది. వరద నీరు ఎక్కువ కాలం రోడ్లపైనే నిల్వ ఉండి గుంతలు పడుతున్నాయి.


మట్టి రోడ్డుకన్నా అధ్వానంగా ఉన్న ఈ రహదారి పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాక నుంచి వేల్పూరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు. 15 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి తాత్కాలిక మరమ్మతులకూ నోచుకోలేదు. మండపాక, గుమ్మంపాడు, వేల్పూరు తదితర గ్రామాల ప్రజలు రైల్వేస్టేషన్‌కు రావడానికి ఇదే ప్రధాన మార్గం.


జంగారెడ్డిగూడెం గ్రామీణ పరిధిలోని లక్కవరం- నిమ్మలగూడెం ప్రధాన రహదారి నుంచి అమ్మపాలెం లింకు రోడ్డు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడికక్కడ రాళ్లు లేచి, ద్విచక్రవాహనచోదకులు నానా అవస్థలు పడుతున్నారు. నాలుగు కి.మీ. పొడవున్న ఈ రోడ్డుపై ప్రయాణించలేక మార్జిన్లలో నుంచి వెళుతున్నారు.


ఉంగుటూరు మండలం చేబ్రోలు నుంచి ద్వారకాతిరుమల వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి ఛిద్రమైంది. గోపీనాథపట్నం నుంచి నల్లమాడు వరకూ దాదాపు 6 కి.మీ. మేర ప్రయాణం నరకప్రాయంగా మారింది. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు ఈ మార్గం నుంచే ప్రయాణిస్తుంటారు. మరమ్మతులకు రూ.15 లక్షలు మంజూరైనా గుత్తేదారులు రాక పనులు ముందుకు సాగలేదు.


ఏలూరు జిల్లా చింతలపూడి- జంగారెడ్డిగూడెం రహదారి టి.నరసాపురం వరకు పది కి.మీ. మేర గుంతలు పడి గుల్లయిపోయింది. జంగారెడ్డిగూడెం, రాజమండ్రికి ఇదే రహదారి కావడంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. పదేళ్లుగా రహదారి వేసిన దాఖలాలు లేవు. ఇటీవల మరమ్మతుల పేరుతో అక్కడక్కడ పూడ్చినా వారం రోజులకే మళ్లీ గుంతలు తేలాయి. తీగలవంచలో ఇటీవల కురిసిన వర్షాలకు అర కి.మీ. మేర రహదారి కోతకు గురైంది. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణ పనుల కోసం తిరుగుతున్న టిప్పర్ల ధాటికి మరింత ఛిద్రమైంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని