రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
రాష్ట్రంలో రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకొనే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందులో కేంద్రం, న్యాయవ్యవస్థలు చొరబడటానికి వీల్లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అందులో కేంద్రం, న్యాయవ్యవస్థ చొరబడలేవు
ప్రత్యేకహోదా హామీని అమలు చేయాల్సిందే
విశాఖ మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు
రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి
ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకొనే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందులో కేంద్రం, న్యాయవ్యవస్థలు చొరబడటానికి వీల్లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రెండు, మూడు రాజధానుల ప్రధాన ఉద్దేశం పాలనా వికేంద్రీకరణే. అధికారం ఒకేచోట కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలూ మిగతావాటితో సమానంగా అభివృద్ధి చెందాలి. అయితే న్యాయవ్యవస్థ ఓవర్‌రీచ్ వల్ల దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు దక్కకుండా పోయాయి. రాజధాని విషయం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆర్టికల్ 154 రెడ్ విత్ 163 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రాజధానిని నిర్ణయించే అంశం పూర్తిగా కార్యనిర్వాహక పరిధిలోనిది కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలోని అంశమే. రాజధానిగా ఏ నగరం ఉండాలన్నది రాష్ట్రప్రభుత్వం నిర్ణయించొచ్చు. అసమానతలను తొలగించాలని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 38 నిర్దేశిస్తోంది. అందుకే మా ప్రభుత్వం ఒకవైపు న్యాయరాజధాని, మరోవైపు కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. 2020 ఫిబ్రవరి 4న హోంమంత్రి లోక్‌సభకు ఇచ్చిన ఓ సమాధానంలోనూ రాష్ట్ర భూభాగంలో రాజధానిని ఎంచుకొనే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని చెప్పారు. అలాగే కేంద్రప్రభుత్వం న్యాయ, కార్యనిర్వాహక రాజధానుల అర్హతలను గుర్తించింది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ అయితే, హైకోర్టు అలహాబాద్‌లో ఉంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్ అయితే హైకోర్టు బిలాస్‌పుర్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌పైనే ఎందుకు వివక్ష చూపుతున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీకి అన్యాయం చేశారు
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమృతకాలాన్ని తనకే పరిమితం చేసుకోకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ చెందేలా చూడాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం భాజపా, కాంగ్రెస్‌ల సంయుక్త వైఫల్యం. ఈ రెండుపార్టీలూ అన్యాయంగా విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేశాయి. అందుకే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 1%, భాజపాకు 0.5% ఓట్లు వచ్చాయి. ఏపీలో అధికారంలో ఉన్న మేం దాన్ని మరిచిపోకుండా నిరంతరం గుర్తుచేస్తున్నాం. దాన్ని పక్కనపెట్టడానికి మేం అనుమతించం. అది ముగిసిన చరిత్ర అని భాజపా చెబుతోంది గానీ, అది చరిత్రలో కలిసిపోవడానికి మేం అంగీకరించం’’ అన్నారు.
ఏపీపై సవతి తల్లి ప్రేమ: మెట్రోరైలుకు నిధులందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘‘విశాఖ మెట్రోకు నిధులివ్వట్లేదు. విభజన చట్టం 13వ షెడ్యూలులోని 12వ పాయింట్ కింద విశాఖ మెట్రోతో పాటు, విజయవాడ-గుంటూరు-తెనాలి గురించీ చెప్పారు. ప్రభుత్వం అన్నది నిరంతరం సాగే వ్యవస్థ కాబట్టి గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టంలోని అంశాలను ప్రస్తుత భాజపా ప్రభుత్వం తిరస్కరించలేదు’’ అన్నారు.
న్యాయవ్యవస్థపై మీ వ్యాఖ్యలను సమర్థించుకొనే డాక్యుమెంట్‌ను సభ ముందు ఉంచండి: రాజ్యసభ ఛైర్మన్
విజయసాయిరెడ్డి తన ప్రసంగంలో జ్యుడిషియల్ ఓవర్‌రీచ్ వ్యాఖ్యలు చేసినప్పుడు ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుంటూ జ్యుడిషియల్ ఓవర్‌రీచ్ గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను చాలా జాగ్రత్తగానే మాట్లాడుతున్నానని విజయసాయిరెడ్డి అన్నప్పుడు... అలాగైతే దాన్ని ధ్రువీకరించాలన్నారు. ‘మీరు ఎలాంటి జ్యుడిషియల్ ఓవర్ రీచ్‌గురించి ప్రస్తావిస్తున్నారు’ అని ప్రశ్నించారు. ‘న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడూ కలిసికట్టుగా వ్యవహరించాలన్నది నా దృఢ అభిప్రాయం. న్యాయవ్యవస్థ పరిధిని మించి వ్యవహరించిందని అనడం అంటే ఒక రకంగా కళంకం ఆపాదించడమే. అందువల్ల దానికి ఆధారాలు చూపండి’ అని అడిగారు. ఏ కారణంతో, న్యాయవ్యవస్థ ఇచ్చిన ఏ తీర్పు ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని నిర్దేశించారు. అందుకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ ప్రస్తుతం ఆ విషయం కోర్టులో ఉందని (సబ్‌జ్యుడిస్), ఆ విషయం దగ్గరకు వస్తానన్నారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ దాంతో సంతృప్తిచెందకుండా సరైన డాక్యుమెంటును సభముందు ఉంచి నిరూపించాలని నిర్దేశించారు. అప్పుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ తాను ఆ విషయం దగ్గరకే వస్తున్నానని, అందులో నాలుగు అంశాలున్నాయని, వాటన్నింటినీ వివరిస్తానని పేర్కొన్నారు. అయితే ఛైర్మన్ ధన్‌ఖడ్ మాత్రం డాక్యుమెంటు ఎక్కడని ఆయన్ను మళ్లీ ప్రశ్నించారు. ‘మీరు మాట్లాడేటప్పుడు.. న్యాయవ్యవస్థ పరిధి దాటడమే సమస్యకు కారణమని చెప్పారు. అందుకే జ్యుడిషియల్ ఓవర్‌రీచ్ వల్ల ఫలానాది జరిగిందని మీ వాదనలను ధ్రువీకరించే అధీకృత డాక్యుమెంటును సభముందు ఉంచాలి’ అని నిర్దేశించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra news: పులివెందులలో కాల్పుల కలకలం
-
India News
Atiq Ahmed: కిడ్నాప్ కేసులో అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు
-
Politics News
KTR: హైదరాబాద్ రోజురోజుకీ విస్తరిస్తోంది: కేటీఆర్
-
Movies News
Allu Arjun: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. 20 ఏళ్ల సినీ ప్రస్థానంపై బన్నీ పోస్ట్
-
General News
AP High court: కాపు రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
-
Sports News
Virat - ABD: తొలినాళ్లలో విరాట్‌ను అలా అనుకున్నా: ఏబీ డివిలియర్స్