Vijayawada: విజయవాడ తూర్పు బైపాస్‌కు కేంద్రం తుదిరూపు?

విజయవాడకు తూర్పు వైపు నిర్మించతలపెట్టిన బైపాస్‌ రోడ్డుకు తుదిరూపు దాదాపు సిద్ధమైనట్లు తెలిసింది. కృష్ణాజిల్లా పొట్టిపాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు మొత్తం 49.3 కి.మీ. మేర నిర్మించేలా కేంద్రం ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.

Updated : 08 Feb 2023 07:26 IST

పొట్టిపాడు నుంచి కాజ వరకు 49.3 కి.మీ.
అంచనా విలువ రూ.4,607 కోట్లు

ఈనాడు, అమరావతి: విజయవాడకు తూర్పు వైపు నిర్మించతలపెట్టిన బైపాస్‌ రోడ్డుకు తుదిరూపు దాదాపు సిద్ధమైనట్లు తెలిసింది. కృష్ణాజిల్లా పొట్టిపాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు మొత్తం 49.3 కి.మీ. మేర నిర్మించేలా కేంద్రం ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. కృష్ణానదిపై 3.750 కి.మీ. వంతెన నిర్మాణమూ ఇందులో ఉంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు రూ.4,607.80 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. విజయవాడకు పశ్చిమవైపు చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా కాజ వరకు బైపాస్‌ నిర్మాణం జరుగుతుండగా, తూర్పువైపు కూడా బైపాస్‌ కావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సమ్మతి తెలిపిన భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఎలైన్‌మెంటు ఖరారు, డీపీఆర్‌ సిద్ధం చేయిస్తోంది. తొలుత తూర్పు బైపాస్‌ 40కి.మీ. మేర ఉంటుందని భావించగా.. నాలుగు మార్గాలను పరిశీలించి తీసుకున్నారు. ఇందులో 49.3 కి.మీ. ఎలైన్‌మెంటుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపే వీలుందని సమాచారం.విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం దాదాపు ఖరారైన ఎలైన్‌మెంటు కృష్ణాజిల్లా పరిధిలో 29.5 కి.మీ., గుంటూరు జిల్లా పరిధిలో 19.770 కి.మీ. మేర ఉంటుంది.

* 100 కి.మీ. వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా నాలుగు వరుసలుగా దీనిని నిర్మించనుండగా, భవిష్యత్తులో ఆరు వరుసల విస్తరణకు వీలుగా 60 మీటర్ల వెడల్పుతో ఎలైన్‌మెంటు ఖరారు చేస్తున్నారు.

* 295 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అంచనా.

* నిర్మాణ వ్యయం 2,215.48 కోట్లు, 295 ఎకరాల భూసేకరణతో పాటు, వాటిలో ఉన్న నిర్మాణాలకు పరిహారం కలిపి రూ.1,176.08 కోట్లు, విద్యుత్‌ స్తంభాలు, కాల్వలు తదితరాలు పక్కకు మార్చేందుకు రూ.39.41 కోట్లు, జీఎస్టీ రూ.1,176.82 కోట్లు కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,607.80 కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం.

* కృష్ణానదిపై వంతెన, 22 ప్రధాన వంతెనలు, 2 ఆర్వోబీలు, ఓ ఫ్లైఓవర్‌, 2 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించేలా ప్రతిపాదిస్తున్నారు.

* ఈ రహదారి కృష్ణాజిల్లా ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు, ఉయ్యూరు మండలాల్లోని.. ఆత్కూరు, పెదఅవుటపల్లి, అల్లాపురం, బుతిమిల్లిపాడు, తెన్నేరు, తరిగొప్పుల, మారేడుమాక, కోమటిగుంట, మానికొండ, కోలవెన్ను, దావులూరు, నేపల్లె, చలివేంద్రపాలెం, బొడ్డపాడు, రొయ్యూరు మీదుగా వెళ్లనుంది. అక్కడినుంచి కృష్ణా నదిపై వంతెన దాటాక గుంటూరు జిల్లాలోని కొల్లిపర్ల, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని.. వల్లభాపురం, పెరకలపూడి, చుక్కపల్లివారిపాలెం, మోరంపూడి, చిలువూరు, తుమ్మపూడి, చినకాకాని, కాజ గ్రామాల మీదగా ఎన్‌హెచ్‌-16లో కలుస్తుంది.

* తరిగొప్పుల, మోరంపూడిల వద్ద రైల్వేలైన్లు, దావులూరు వద్ద మచిలీపట్నం-విజయవాడ జాతీయరహదారి మీదగా తూర్పుబైపాస్‌ వెళ్లేలా ఎలైన్‌మెంటు రూపొందించారు.

* దీనికి తుది ఆమోదం లభించాల్సి ఉందని, చివర్లో స్వల్ప మార్పులు ఉండే వీలుందని అధికారులు చెబుతున్నారు.

భారం లేకుండా లాజిస్టిక్‌ పార్కుకు స్థలం

భూసేకరణ భారం రాష్ట్రప్రభుత్వం భరించాలని తొలుత కేంద్రం కోరింది. అయితే నిధులు వెచ్చించే పరిస్థితి లేదని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే వివిధ ఖనిజాలకు తీసుకునే సీనరేజి ఫీజు, నిర్మాణ సామగ్రికి రాష్ట్ర జీఎస్టీని మినహాయించాలని కేంద్రం సూచించింది. విజయవాడకు సమీపంలో నిర్మించనున్న మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు 100 ఎకరాలు ఉచితంగా కేటాయించాలని కేంద్రం కోరింది. మంగళగిరిలో 100 ఎకరాలను రాష్ట్రప్రభుత్వం ఎంపికచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని