పాఠశాలలో ఊడిపడిన శ్లాబ్‌ పెచ్చులు

ఇటీవల ‘నాడు-నేడు’ పనులు చేపట్టిన తరగతి గదిలో శ్లాబ్‌ పెచ్చులు ఊడిపడి, ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

Published : 08 Feb 2023 04:35 IST

విశాఖ జిల్లా పద్మనాభంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు
‘నాడు-నేడు’లో నాసిరకం పనులే కారణం

పద్మనాభం, న్యూస్‌టుడే: ఇటీవల ‘నాడు-నేడు’ పనులు చేపట్టిన తరగతి గదిలో శ్లాబ్‌ పెచ్చులు ఊడిపడి, ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, విద్యార్థులు తెలిపిన ప్రకారం... పద్మనాభం పరిధిలోని అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో భవనం శ్లాబు పెచ్చు అకస్మాత్తుగా కింద కూర్చున్న చిన్నారులపై పడింది. దాంతో తాలాడ వేదశ్రీ, ఆమె అన్న తాలాడ ప్రేమ్‌చంద్‌, పసుమర్తి నిత్యశ్రీ గాయపడ్డారు. వీరిలో ఒకటో తరగతి విద్యార్థిని వేదశ్రీ తలకు తీవ్ర గాయమవడంతో 108 అంబులెన్సులో విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.  పనులు నాసిరకంగా చేపట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

మరమ్మతులు జరుగుతుండగానే...: ఇక్కడ ఒకటి నుంచి అయిదు తరగతుల విద్యార్థులు 18 మంది చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక వాలంటీరు పనిచేస్తున్నారు. పాఠశాలలోని రెండు భవనాలను ‘నాడు-నేడు’లో భాగంగా రూ.12 లక్షలతో మరమ్మతు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1987లో నిర్మించిన పాత భవనం శ్లాబుకు లోపల సీలింగ్‌కు ప్లాస్టరింగ్‌ చేశారు. మరో భవనంలో కూర్చుంటున్న విద్యార్థులను ఇందులోకి మార్చారు. ఇదేవిషయమై పద్మనాభం సచివాలయం ఇంజినీరింగ్‌ సహాయకుడు రెడ్డిపల్లి అశోక్‌ కుమార్‌ను వివరణ కోరగా... ‘ఈ భవనాన్ని నిర్మించినప్పుడు శ్లాబ్‌ సీలింగ్‌కు ప్లాస్టరింగ్‌ చేయకుండా... తెల్ల సున్నం వేశారు. ఇప్పుడు దానిపైనే ప్లాస్టరింగ్‌ చేయగా సరిగా పట్టకపోవడంతో పెచ్చులు ఊడిపడ్డాయి’ అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు