ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు 5% కోటా ఇవ్వాలి

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్‌ అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీమంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్లో ‘వ్యాజ్య విచారణార్హత’పై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Published : 08 Feb 2023 04:35 IST

హైకోర్టును అభ్యర్థించిన కాపు సంక్షేమ సేన
‘వ్యాజ్య విచారణార్హత’పై కౌంటర్‌ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్‌ అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీమంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్లో ‘వ్యాజ్య విచారణార్హత’పై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు మంగళవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు. ప్రస్తుత పిటిషన్‌కు ప్రజాప్రయోజన వ్యాజ్య స్వరూపం ఉందని ప్రాథమికంగా అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో 5% కాపులకు కేటాయిస్తూ తెదేపా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఉన్నత విద్య ప్రవేశాల్లో కేవలం ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకే 10 శాతం కోటా అమలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం 2019 జులై 27న తీసుకొచ్చిన జీవో 60ని రద్దు చేయాలని కోరారు.

రిజర్వేషన్‌ ఫలాలు అందడం లేదు: పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు

మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్‌ వాటాలో 5% రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తూ యాక్ట్‌ 14/2019ని తీసుకొచ్చారన్నారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా ఆ చట్టాన్ని సమర్థించిందన్నారు. ఆ చట్టానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం జీవో 60 తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కింద 5 శాతం రిజర్వేషన్‌ వర్తించకుండా పోతోందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. అందుకు అభ్యంతరం ఏమిటో తెలియజేస్తూ కౌంటర్‌ వేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు