‘హయగ్రీవ’ నిర్వాహకుల మరో ఎత్తుగడ

విశాఖ నగర శివారు ఎండాడలో హయగ్రీవ ఫార్మ్స్‌, డెవలపర్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి మహా విశాఖ నగరపాలక సంస్థ నుంచి మళ్లీ ప్లాను పొందడానికి నిర్వాహకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Updated : 08 Feb 2023 05:32 IST

జీవీఎంసీ నుంచి ప్రణాళిక పొందేందుకు వ్యూహం

విశాఖపట్నం(కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: విశాఖ నగర శివారు ఎండాడలో హయగ్రీవ ఫార్మ్స్‌, డెవలపర్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి మహా విశాఖ నగరపాలక సంస్థ నుంచి మళ్లీ ప్లాను పొందడానికి నిర్వాహకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం కమిషనర్‌ రాజాబాబును కలిశారు. ఎండాడలో వృద్ధులు, అనాథలకు వసతి కల్పించడానికి ప్రభుత్వం హయగీవ్ర సంస్థకు 12.51ఎకరాల స్థలాన్ని కేటాయించింది. గతంలో ఇచ్చిన ప్లాను గడువు ముగిసినా నిర్మాణాలు చేపట్టకపోవడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా ఇతర నిర్మాణాలు చేపట్టడానికి యత్నాలు సాగించడం జీవీఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో స్థలం ఏ ప్రాతిపదికన కేటాయించారనే అంశంపై జిల్లా కలెక్టరు నుంచి తాజా నిరభ్యంతర ధ్రువీకరణపత్రం తీసుకోవాలని అధికారులు ప్లాను దరఖాస్తు షార్ట్‌ఫాల్స్‌లో కోరారు. కలెక్టర్‌ మల్లికార్జున కూడా స్థల కేటాయింపుపై ప్రభుత్వానికి లేఖ రాయగా, అక్కడి నుంచి సమాధానం రాలేదు. ఈ క్రమంలో స్థలం కేటాయింపునకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నాయని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ కోర్టులో కేసు వేశారు. మరోపక్క జీవీఎంసీ అధికారులు తమకు ప్లాను మంజూరు చేయట్లేదని నిర్మాణదారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు ఈ కేసు వివరాలను కోర్టుకు అందజేశారు. మూర్తియాదవ్‌ కేసులో జీవీఎంసీ ఇంకా కౌంటరు దాఖలు చేయలేదు.

టీడీఆర్‌ పొందే వ్యూహం

హయగ్రీవ చేపడుతున్న నిర్మాణం పక్కనే వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక రహదారి ఉండటంతో, దానికి ఆర్‌డీపీˆ (రహదారి అభివృద్ధి ప్రణాళిక) తయారుచేయాలని మంగళవారం సాయంత్రం కమిషనర్‌ను గన్నమనేని వెంకటేశ్వరరావు కోరినట్లు తెలిసింది. సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ ఆఫ్‌ ది బాప్టిస్ట్‌ చర్చి ఆఫ్‌ ది నార్తరన్‌ సర్కార్స్‌) స్థల యజమానిపై వివాదం ఉండగా రూ.62కోట్ల విలువైన టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌)ను జీవీఎంసీ నుంచి ఎలా తీసుకున్నారో.. అదే తరహాలో టీడీఆర్‌ పొందాలనే వ్యూహంతో హయగ్రీవ నిర్మాణదారులు జీవీఎంసీ అధికారులను కలిసినట్లు సమాచారం. స్థల కేటాయింపుపై వివాదం నడుస్తుండటం, కలెక్టరు నుంచి నిరభ్యంతర ధ్రువీకరణపత్రం కోరడం లాంటి అంశాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే టీడీఆర్‌ ఎలా ఇస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై జీవీఎంసీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని