వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కోరారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో మంగళవారం ఆయన మాట్లాడారు.

Updated : 08 Feb 2023 05:41 IST

అనంతపురం ఎంపీ తలారి రంగయ్య

ఈనాడు, దిల్లీ: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కోరారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తర్వాత బ్రిటిషర్లు అడవులను ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో 1865లో అటవీ చట్టం, 1871లో నేర జాతుల చట్టం తెచ్చి గిరిజనులపై ప్రయోగించారు. అడవులు అంతరించాక గిరిజనులుగా వాల్మీకి బోయలు మైదానాలకు వచ్చారు. 1952లో తరచూ నేరాలు చేసే తెగగా బోయలను పేర్కొని పుట్టకముందే వారిపై నేరస్థులుగా ముద్రవేశారు. రాయలసీమలో ఏ హత్య జరిగినా బోయ వాల్మీకీలు లేకుండా జరగలేదని 1961-62లో ఏపీ ట్రైబ్‌ ఎంక్వయిరీ కమిటీ తెలిపింది. ఈ జాతి వారు బ్రిటిషర్లు మొదలు పాలెగాళ్లు, నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకుల వరకు ఇలా... అందరివైపు ఉంటూ నష్టపోతున్నారు. చంపేవారు, చచ్చేవారు బోయలే. వీరిని 1961లో ఆదిమ గిరిజన తెగగా, అనంతరామన్‌ కమిటీ డీనోటిఫైడ్‌ జాతిగా గుర్తించింది. ఏపీ ట్రైబ్‌ ఎంక్వయిరీ కమిటీ సైతం ఎస్టీ జాబితాలో చేర్చాలని సూచించింది. తొలి పార్లమెంట్‌ నుంచి నేటి వరకు ప్రతిసారీ ఉభయ సభల్లో బోయలపై చర్చ సాగింది. 1964లో బోయలను ఎస్టీలుగా గుర్తించి ఏడేళ్ల తర్వాత తొలగించారు. అందుకు సంబంధించిన పత్రాలు ఎస్టీ కమిషన్‌ మొదలు రాష్ట్రపతి భవన్‌ వరకు ఎక్కడా లేవు. ఎస్టీల్లో చేర్చితేనే బోయలకు విద్య, ఉపాధి అవకాశాలు లభించి, వారి స్థితిగతులు మారుతాయి. దీనిపై కేంద్రం చొరవ చూపాలి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి’ అని ఆయన కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు