ఏపీలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణంలో పురోగతి కరవు

ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణం, స్థాయి పెంపునకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నా రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు.

Updated : 08 Feb 2023 05:46 IST

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణం, స్థాయి పెంపునకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నా రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. వీటి ఏర్పాటుపై కేంద్రానికి సరైన సమాచారమూ అందడం లేదు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. అమరావతితోపాటు ఇతర ప్రాంతాల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణం, పురోగతిపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు 2017-18, 2018-19లలో రూ.42.35 కోట్లు కేటాయించారు. 2021-21లో రూ.28.75 కోట్లు, 2022-23లో రూ.37.40 కోట్లు, 2023-24లో రూ.43.50 కోట్లు ఇచ్చారు. 2020 నవంబరు నుంచి రూ.14.36 కోట్లకు సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలను ఆంధ్రప్రదేశ్‌ సమర్పించనందున ఈ ఏడాది నిధులు విడుదల చేయడం లేదు’ అని వివరించారు.

* 2021లో వచ్చిన వర్షాలు, వరదలు, తుపాన్లతో వచ్చిన నష్టాల ఉపశమనానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.351.43 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. అమలాపురం, తిరుపతి, విశాఖపట్నం, హిందూపురం ఎంపీలు చింతా అనురాధ, మద్దెల గురుమూర్తి, ఎం.వి.వి.సత్యనారాయణ, గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర విపత్తు ఉపశమన నిధికి కేంద్రం వాటాగా రూ.895.20 కోట్లు ఇచ్చామన్నారు.

ఏపీలో 2,246 డొల్ల కంపెనీల మూత

ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో 2,246 డొల్ల కంపెనీలను మూసేసినట్లు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రి రావ్‌ ఇందర్‌జిత్‌ సింగ్‌ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలోనూ ఇలాంటి 8,148 కంపెనీలను రద్దు చేశామన్నారు.


సమగ్ర ఉద్యానాభివృద్ధి మిషన్‌ కింద శీతల గిడ్డంగులకు నిధులు

సమగ్ర ఉద్యానాభివృద్ధి మిషన్‌ కింద 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణలో 51 శీతల గిడ్డంగులకు రూ.64.86 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 49 శీతల గిడ్డంగులకు రూ.65.70 కోట్ల ఆర్థిక సహాయం అందజేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు.

* 2019, 2020, 2021 సంవత్సరాల్లో వరుసగా ఏపీలో 628, 564, 481 మంది, తెలంగాణలో 491, 466, 352 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ మూడేళ్లలో దేశవ్యాప్తంగా 16,854 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

* ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 47 ప్రతిపాదనలు రాగా 26కు, తెలంగాణ నుంచి 42 ప్రతిపాదనలు రాగా 19కు ఆమోదం తెలిపి ప్రకటన చేసినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఖేలో ఇండియా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 17 మంది క్రీడాకారులను కోచ్‌లు/మెంటార్లుగా నియమించినట్లు వెల్లడించారు.

* పశు వైద్య అంబులెన్సులకు ఆంధ్రప్రదేశ్‌లో 340 వాహనాలకు రూ.54.50 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. విశాఖపట్నం ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

* తిరుపతి ఐఐటీలోని ఇంక్యుబేషన్‌ కేంద్రానికి రూ.238 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు