ఎట్టకేలకు స్మార్ట్‌ కార్డులకు టెండర్లు

రాష్ట్ర రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రాలకు అవసరమైన స్మార్ట్‌ కార్డులకు ఎట్టకేలకు టెండర్లు పిలిచారు.

Updated : 08 Feb 2023 05:48 IST

నెలకు 3 లక్షలు సరఫరా, ప్రింటింగ్‌, డెలివరీకి ప్రతిపాదన

ఈనాడు-అమరావతి: రాష్ట్ర రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రాలకు అవసరమైన స్మార్ట్‌ కార్డులకు ఎట్టకేలకు టెండర్లు పిలిచారు. ఏడాదిన్నరగా వీటి జారీ నిలిచిపోయింది. దాదాపు 30 లక్షల వరకు కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. ప్రతినెలా సగటున లక్షన్నర డ్రైవింగ్‌ లైసెన్సులు, మరో లక్షన్నర ఆర్‌సీలు జారీ అవుతున్నట్లు 2021-22లో లెక్క తేల్చారు. నెలకు 3 లక్షల చొప్పున ఏడాదికి 36 లక్షల కార్డులు సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటి సంఖ్య ఏటా 15 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని టెండర్లను పిలిచారు. మార్చి 3 వరకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంది. 10న సాంకేతిక బిడ్లు తెరవనున్నారు. 23న ధరల బిడ్లు తెరిచి, అదే రోజు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపికైన గుత్తేదారు అయిదేళ్ల పాటు స్మార్టు కార్డుల సరఫరా, రాష్ట్రస్థాయిలో కేంద్రీకృత కార్యాలయంలో ప్రింటింగ్‌, కార్డుదారులకు వాటిని అందజేసే బాధ్యతలు చూడాల్సి ఉంటుంది.

క్యూర్‌ కోడ్‌తో కార్డులు: గుత్తేదారు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ప్రాక్సిమిటీ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ కార్డును (పీఐసీసీ) సరఫరా చేయనున్నారు. ఒక్కో డీఎల్‌, ఆర్‌సీ కార్డుల కోసం ప్రభుత్వం రూ.200 చొప్పున వసూలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని