తుర్కియేలో భూకంపం.. సిక్కోలులో ఉలికిపాటు!

తుర్కియేను కుదిపేసిన భూకంపం ప్రకంపనలు శ్రీకాకుళం జిల్లానూ తాకాయి. ఉద్దానం ప్రాంతానికి చెందిన వేలమంది కార్మికులు భవన నిర్మాణం తదితర రంగాల్లో అక్కడ ఉపాధి పొందుతున్నారు.

Published : 08 Feb 2023 05:20 IST

ఉపాధి కోసం తరలివెళ్లిన యువత
నిద్రలో ఉండగా ప్రకంపనలతో ఆందోళన  
తెలుగువారంతా క్షేమమేనని వెల్లడి

సోంపేట, కవిటి, న్యూస్‌టుడే: తుర్కియేను కుదిపేసిన భూకంపం ప్రకంపనలు శ్రీకాకుళం జిల్లానూ తాకాయి. ఉద్దానం ప్రాంతానికి చెందిన వేలమంది కార్మికులు భవన నిర్మాణం తదితర రంగాల్లో అక్కడ ఉపాధి పొందుతున్నారు. అత్యంత తీవ్రతతో భూకంపం రావడంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఊరికి దూరంగా కంటైనర్లలో బస ఏర్పాటు చేయడంతో తమకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వారు తెలిపారు. ఇటు స్వగ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులు వారి యోగక్షేమాల గురించి తెలుసుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. తొలుత వారి ఫోన్లు కలవకపోవడంతో కంగారు పడ్డారు. అనంతరం అందరూ క్షేమంగా ఉన్నారనే వార్తతో ఊపిరి పీల్చుకున్నారు. ‘న్యూస్‌టుడే’ అక్కడ ఉన్న కొందరు తెలుగువారితో మాట్లాడింది.

శ్రీకాకుళం జిల్లా కవిటికి చెందిన గురుదేవ్‌, సోంపేట మండలం గొల్లూరుకు చెందిన రత్నాల కామరాజు, కంచిలి మండలం ఎక్కలూరుకు చెందిన నెయ్యిల గణేశ్‌ భూకంప సమయంలో తమ అనుభవాలను వివరించారు. ఉపాధి కోసం రెండు నెలల క్రితమే తుర్కియేకు వచ్చామని.. అదానా నగరానికి సమీపంలో ఉంటూ ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నామని తెలిపారు. ఆ ప్రాంతం సిరియా సరిహద్దుకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. సోమవారం ఉదయం 04.15 గంటల సమయంలో తీవ్రమైన భూ ప్రకంపనలు వచ్చాయని.. ఆ సమయంలో తాము కంటైనర్లలో నిద్రపోతున్నామని చెప్పారు. దాదాపు నిమిషం పాటు తామున్న కంటైనర్‌ కదిలిందని.. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురై అందరినీ నిద్రలేపి బయటకు వచ్చేశామన్నారు. ఏం జరుగుతుందో తెలియక కాళ్లూ చేతులూ వణికిపోయాయని తమ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. కొందరు భయంతో బయటకు పరుగు తీశారని తెలిపారు. మళ్లీ భూకంపం వస్తుందనే వార్తలతో బిక్కుబిక్కుమంటూ గడిపామన్నారు. స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్‌ చేసి క్షేమంగా ఉన్నామని చెప్పాకే వారు కుదుటపడ్డారని చెప్పారు. తాము పనిచేస్తున్న సంస్థ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటోందన్నారు. తాము బస చేసిన ప్రాంతంలో ఉన్న తెలుగువారంతా క్షేమంగానే ఉన్నారని తెలిసిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని