రాజధానిపై అధ్యయనానికి అప్పట్లోనే కేంద్ర కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంతో ముడిపెట్టింది. రాజధానిపై అధ్యయనం కోసం ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని వెల్లడించింది.

Published : 09 Feb 2023 04:42 IST

ఆ కమిటీ నిపుణుల నివేదిక తర్వాతే రాజధానిగా అమరావతి ఎంపిక
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంతో ముడిపెట్టింది. రాజధానిపై అధ్యయనం కోసం ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని వెల్లడించింది. ఆ తర్వాత (ప్రస్తుత) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల చట్టాలను తీసుకొచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ బుధవారం ఈ విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారు. ‘రాజధానిని నిర్ణయించుకొనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ముక్తకంఠంతో చెప్పిన మాట వాస్తవమా? అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒకటికి మించిన రాజధానులను ఏర్పాటు చేసుకోవడానికి నిరాకరిస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి’ అని బుధవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.

‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్‌ 5, 6లను అనుసరించి రాష్ట్ర నూతన రాజధాని కోసం ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికను తగిన చర్య కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపింది. 2015 ఏప్రిల్‌ 23న అమరావతిని రాజధాని నగరంగా నోటిఫై చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) రద్దు చట్టం- 2020, ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం- 2020 చేసింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు పరిపాలనా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అది అవకాశం కల్పిస్తోంది. ఈ చట్టాలు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు. ఆ తర్వాత ఈ రెండు చట్టాలను రద్దు చేస్తూ 2020లో చట్టం చేసింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది’ అని హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని