నిధుల మళ్లింపు అలవాటుగా మారింది

ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నిధులను మళ్లించడం.. తిరిగి జమ చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 09 Feb 2023 04:41 IST

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నిధులను మళ్లించడం.. తిరిగి జమ చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పంచాయతీ నిధుల మళ్లింపుపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్‌ వేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ. 7,659 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర పంచాయతీ పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎం.రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, కొందరు సర్పంచులు గత ఏడాది ప్రజాహిత వ్యాజ్యం వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. విద్యుత్‌ బిల్లు బకాయిల సర్దుబాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులు మళ్లించిందన్నారు. దీనివల్ల అభివృద్ధి పనులకు పంచాయతీల వద్ద సొమ్ము లేకుండాపోయిందని తెలిపారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని గతంలో న్యాయస్థానం ఆదేశించినప్పటికి, చేయలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. నిధులు మళ్లించడం, జమ చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని