అదానీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేం

అదానీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేం. వాళ్లకు కొత్తగా ఏమీ ఇవ్వడంలేదు. ఇప్పుడున్న వాటికే పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద ఇచ్చే రాయితీలు మాత్రమే ఇచ్చాం’ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టంచేశారు.

Updated : 09 Feb 2023 10:05 IST

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

ఈనాడు, అమరావతి: ‘అదానీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేం. వాళ్లకు కొత్తగా ఏమీ ఇవ్వడంలేదు. ఇప్పుడున్న వాటికే పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద ఇచ్చే రాయితీలు మాత్రమే ఇచ్చాం’ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టంచేశారు. అదానీ గ్రూప్‌పై అంతర్జాతీయంగా, పార్లమెంట్‌లో తీవ్ర చర్చ జరుగుతోందని, దాని షేరుహోల్డర్లు అయోమయంలో ఉన్నారని, అదానీపై పునరాలోచన చేయాలి కదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పైవిధంగా స్పందించారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వివరించే సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

ప్రశ్న: ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఎందుకున్నారు? ఫోన్‌ ట్యాపింగ్‌లు జరుగుతున్నాయని అంటున్నారు?

మంత్రి:ఎవరూ అసంతృప్తితో లేరు. మనమీద మనకు నమ్మకంలేని మాటలవి. అలా మాట్లాడుతున్న సోదరులకు వేరే ఎజెండా ఉంది. మా ఎమ్మెల్యేలు, మంత్రులెవరికీ లేని అనుమానాలు ఆయనకే ఎందుకు వస్తున్నాయి? మేం స్వేచ్ఛగా ఉన్నాం.

ప్రశ్న:ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారని, ఆగస్టులో ఎన్నికలకు వెళ్లనున్నారని అచ్చెన్నాయుడు అంటున్నారు.

మంత్రి: ఆయన కలగన్నారేమో. తొలిరోజు నుంచీ ప్రభుత్వాన్ని నడపలేమన్నారు. శ్రీలంక అయిపోతుందన్నారు. ఎక్కడైంది?

ప్రశ్న:మరి ఒకటో తేదీన జీతాలే ఇవ్వలేకపోతున్నారు కదా? ఉద్యోగులు గవర్నర్‌ను కలిసి జీతాలు ఇప్పించాలని కోరారు కదా?

మంత్రి: జీతాలు ఇవ్వడమనేది నిరంతర ప్రక్రియ. ఆయన (చంద్రబాబు) కూడా ఒకటో తేదీనే తప్పనిసరిగా జీతాలు ఇవ్వలేదు. పింఛన్లు 6 నెలలకోసారి ఇచ్చేవారు.

ప్రశ్న: ఈ ఇబ్బందుల కారణంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు?

మంత్రి:వాళ్ల కేడర్‌ చేజారిపోకుండా, తొందరగా ఎన్నికలు వస్తాయని చెబితే కొందరైనా వచ్చి కలుస్తుంటారనే ఈ ప్రచారం చేస్తున్నారు.

ప్రశ్న: ఎమ్మెల్యే కోటంరెడ్డికి కనిపించిన అమరావతి రైతులు, మీకు ఎందుకు కనిపించడం లేదు?

మంత్రి: ఆయన ఏ ఎజెండాతో మాట్లాడారో అందరికీ తెలుసు. ఆయనకు వాళ్లు ఎప్పుడు కనిపించారో కూడా తెలుసు.

ప్రశ్న: జగన్‌కు భయమంటే ఏమిటో చూపిస్తానని లోకేశ్‌ అంటున్నారు?

మంత్రి: భయపడేవాళ్లే భయంపై మాట్లాడుతారు. లోకేశ్‌ పాదయాత్రకు జనం రావడంలేదని సామాజిక మాధ్యమాల్లో చూశాను. లోకేశ్‌ను సీఎం చేయాలని చంద్రబాబు తపన. కానీ... సీఎం అభ్యర్థిగా ప్రకటించే ధైర్యం మాత్రం చేయలేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని