పుర ఆర్డీ కార్యాలయాల ముట్టడి అడ్డగింత

పుర, నగరపాలక సంస్థల్లోని కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన పురపాలక ప్రాంతీయ సంచాలకుల (ఆర్డీ) కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు.

Published : 09 Feb 2023 02:51 IST

ఏపీ మున్సిపల్‌ కార్మిక సంఘం నేతల గృహనిర్బంధం

ఈనాడు, అమరావతి: పుర, నగరపాలక సంస్థల్లోని కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన పురపాలక ప్రాంతీయ సంచాలకుల (ఆర్డీ) కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. సంఘం నాయకులను మంగళవారం రాత్రి నుంచే గృహ నిర్బంధం చేశారు. ప్రజారోగ్య, ఇంజినీరింగ్‌ కార్మికులకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానం రద్దు, పొరుగు సేవకులు మృతి చెందిన చోట్ల వారి కుటుంబ సభ్యులకు ఉపాధి, ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ రద్దు, శాశ్వత కార్మికులకు సంబంధించిన ఐదు డీఏలు, సరెండర్‌ సెలవులకు సంబంధించిన మొత్తాలు సత్వరం విడుదల, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18,500 జీతం చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లతో గుంటూరు, అనంతపురం, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలోని పురపాలక ప్రాంతీయ సంచాలకుల కార్యాలయాల ముట్టడికి కార్మికులు బుధవారం ప్రయత్నించారు. మంగళవారం రాత్రి నుంచి పలువురు నాయకులు, కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉదయం ఆర్డీ కార్యాలయాల వద్ద మోహరించి మిగతా నాయకులు, కార్మికులను అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పలు చోట్ల కార్మికులు నినదించారు. దీంతో ప్రాంతీయ సంచాలకులు.. కార్యాలయం నుంచి బయటకొచ్చి నేతల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. ఏపీ మున్సిపల్‌ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.రంగనాయకులు, పి.సుబ్బారాయుడు విశాఖపట్నం, అనంతపురంలో, గౌరవ సలహాదారు ఎన్‌.సుబ్బారావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేశ్‌ రాజమహేంద్రవరం, గుంటూరు ఆర్డీ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు