మధ్యాహ్న భోజనం వికటించి 38 మందికి అస్వస్థత

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కోన ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.

Published : 09 Feb 2023 02:51 IST

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘటన

మక్కువ, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కోన ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 144 మంది కూరగాయల పలావుతోపాటు బంగాళదుంప కుర్మా, గుడ్డు, శనగ చిక్కీలు తిన్నారు. కాసేపటికే పలువురికి కడుపులో నొప్పితోపాటు వాంతులు కావడంతో ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. స్థానిక పీహెచ్‌సీకి సమాచారం అందించగా సిబ్బంది చేరుకుని చికిత్స అందించారు. గ్రామస్థులూ చేరుకుని సాయం చేశారు. సమస్య తగ్గని 38 మందిని 108 అంబులెన్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వెంటనే మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందని ఇన్‌ఛార్జి డీఈవో బ్రహ్మాజీరావు, డీఎంహెచ్‌వో జగన్నాథరావు తెలిపారు. వారిద్దరూ పాఠశాలను పరిశీలించి, ఉపాధ్యాయులు, వంట నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమయ్యారు. పలావు ఉడక్కపోవడం, తాగునీరు సరిగా లేకపోవడంతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కాసేపు ఉపాధ్యాయులను నిర్బంధించారు. అధికారులు వచ్చి మాట్లాడడంతో పరిస్థితి సద్దుమణిగింది.

కొత్తవలసలో 10 మంది విద్యార్థినులకు అస్వస్థత

కొత్తవలస, ఎస్‌.కోట, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా కొత్తవలస బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు మంగళవారం పులిహోర తిని అస్వస్థతకు గురయ్యారు. వారిలో చికిత్స పొందుతున్న పది మంది ఆరోగ్యం బుధవారం మళ్లీ క్షీణించింది. దాంతో ఒకరిని విజయనగరం, తొమ్మిది మందిని ఎస్‌.కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అధికారులు హాస్టల్‌లోని తాగునీరు, ఆహార నమూనాలను పరీక్షల కోసం సేకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు