కార్డుదారులు కోరితే.. రేషన్‌లో రెండు కిలోల కందిపప్పు

రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.

Published : 09 Feb 2023 02:51 IST

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం: మంత్రి కారుమూరి

ఈనాడు, అమరావతి: రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ నుంచి రేషన్‌ పంపిణీ వరకు అన్నింటిని పరిశీలించేందుకు విజయవాడలోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ‘రేషన్‌ కార్డుదారులు కోరితే నెలకు ఒక్కో కుటుంబానికి 2 కిలోల చొప్పున కందిపప్పు ఇచ్చేందుకు సిద్ధమే. అయితే ప్రస్తుతం కిలో చొప్పున ఇస్తున్న కందిపప్పునే వారు తీసుకోవడం లేదు’ అని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘రెండు వారాల్లో చిరుధాన్యాల పంపిణీ మొదలు పెడతాం. గోధుమపిండి పంపిణీని రాష్ట్రమంతటా విస్తరిస్తాం. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ధాన్యం లోడింగ్‌, రవాణా, మిల్లుల్లో మర ఆడించి గోదాములకు పంపడం సహా అన్నీ సీసీ కెమెరాల ద్వారా ప్రతి నిమిషం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాం. ఎండీయూ వాహనాలు ఎక్కడున్నాయి? ఇంటింటికి వెళ్తున్నాయో లేదో కూడా తెలిసేలా ఏర్పాట్లు చేశాం’ అని పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్‌ దగ్గర అదనంగా సొమ్ము ఉన్నందునే ఆ సంస్థ నుంచి రూ.3,200 కోట్లను అప్పుగా తీసుకున్నామని మంత్రి కారుమూరి వివరించారు. పౌరసరఫరాల సంస్థకు అప్పులు దొరక్క పోవడంతోనే మార్క్‌ఫెడ్‌ ద్వారా తీసుకున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా ఇంకా రూ.5వేల కోట్లపైనే అప్పు తీసుకునే అవకాశం ఉన్నా తాము తీసుకోలేదని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని