విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో ఒక్క యూనిట్‌నూ కొనం!

వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) బహిరంగ మార్కెట్‌లో ఒక్క యూనిట్‌ విద్యుత్‌ కొనాల్సిన అవసరమే విద్యుత్‌ సంస్థలకు లేదంట? ఏటా కనీసం 3-4 వేల మిలియన్‌ యూనిట్ల (ఎంయూ)ను కొంటున్న డిస్కంలకు ఇదెలా సాధ్యమైందని విద్యుత్‌రంగ నిపుణులు విస్తుపోతున్నారు.

Published : 09 Feb 2023 04:32 IST

2023-24 సంవత్సరానికి డిస్కంల వింత లెక్క
ఆదాయ లోటు తగ్గించి చూపిన డిస్కంలు
ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ తగ్గే అవకాశం
రూ.7,702 కోట్ల భారాన్ని ప్రజలు మోయాల్సిందేనా?

ఈనాడు, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) బహిరంగ మార్కెట్‌లో ఒక్క యూనిట్‌ విద్యుత్‌ కొనాల్సిన అవసరమే విద్యుత్‌ సంస్థలకు లేదంట? ఏటా కనీసం 3-4 వేల మిలియన్‌ యూనిట్ల (ఎంయూ)ను కొంటున్న డిస్కంలకు ఇదెలా సాధ్యమైందని విద్యుత్‌రంగ నిపుణులు విస్తుపోతున్నారు. 2023-24 వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో (ఏఆర్‌ఆర్‌) బహిరంగ మార్కెట్‌ విద్యుత్‌ కొనుగోళ్ల ప్రస్తావనే లేకుండా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి (ఏపీఈఆర్‌సీ) డిస్కంలు ప్రతిపాదనలను సమర్పించాయి. దీనివల్ల ప్రభుత్వం నుంచి రాయితీగా వచ్చే మొత్తాన్ని డిస్కంలు కోల్పోవాల్సి వస్తోంది. ఫలితంగా ఆ భారం వినియోగదారులపై పడే అవకాశముంది. డిస్కంలు ఇప్పటికే రూ.56 వేల కోట్ల అప్పుల్లో మునిగాయి. బహిరంగ మార్కెట్‌ కొనుగోలు లెక్కలు చూపని కారణంగా మరో రూ.5 వేల కోట్ల అప్పులు పెరిగే అవకాశం ఉంది. దీనిపై ఏపీఈఆర్‌సీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఒక్క యూనిట్‌ కొనకుండా ఎలా సాధ్యం?

రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్‌ డిమాండ్‌ 216 ఎంయూలకు చేరింది. మున్ముందు 260 ఎంయూలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇందులో జెన్‌కో నుంచి 90 ఎంయూలు, కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 50 ఎంయూలు వస్తుంది. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 20 ఎంయూలు వస్తుందని అంచనా. ఇప్పుడే రోజుకు 40 ఎంయూల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌ నుంచి కొంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.3,148.87 కోట్లతో 3,407.24 ఎంయూలను విద్యుత్‌ ఎక్స్ఛేంజీల నుంచి కొనాల్సి ఉంటుందని అంచనా. ఈ ఏడాది పెరిగే విద్యుత్‌ డిమాండ్‌ అంచనాల ప్రకారం... 2023-24లో బహిరంగ మార్కెట్‌ నుంచి సుమారు 5 వేల ఎంయూలను కొనాల్సి వస్తుంది. యూనిట్‌కు సగటున రూ.9 వంతున లెక్కించినా.. రూ.4-5 వేల కోట్లను డిస్కంలు ఖర్చు చేయాల్సి వస్తుంది.

* పునరుత్పాదక విద్యుత్‌ ఎక్కువగా ఉండటంతో గ్రిడ్‌ను సమన్వయం చేయడానికి ఇబ్బంది ఏర్పడుతుందని... పీక్‌ డిమాండ్‌ సమయంలో పునరుత్పాదక విద్యుత్‌తో ఉపయోగం లేదని ఏఆర్‌ఆర్‌లో ఇవే డిస్కంలు స్పష్టంచేశాయి. అలాంటప్పుడు పీక్‌ డిమాండ్‌ సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పొంతన లేని లెక్కలు ఎలా చూపాయి?

ప్రభుత్వంపై భారాన్ని తగ్గించడానికేనా?

2023-24లో నికర ఆదాయ లోటును డిస్కంలు రూ.12,792.70 కోట్లుగా అంచనా వేస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనేందుకు ఉపయోగించే రూ.5 వేల కోట్లు కూడా కలిపితే అది రూ.17,792 కోట్లకు చేరుతుంది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం భరించే రాయితీ కూడా పెరిగే అవకాశం ఉండేది. ప్రభుత్వంపై రాయితీ భారం తగ్గించేలా డిస్కంలు వ్యవహరించాయన్న అనుమానాన్ని విద్యుత్‌రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం భరించే రాయితీపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ 2022-23లో మాదిరే రూ.10,090 కోట్లు ఇస్తుందని భావించినా... మిగిలిన రూ.7,702 కోట్లు ఛార్జీల రూపేణా ప్రజలపై పడే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని