చిన్నతరహా గ్రానైట్‌ పరిశ్రమకు ఊరట

రాష్ట్రంలో చిన్నతరహా గ్రానైట్‌ పరిశ్రమలకు యూనిట్‌ రూ.2కే విద్యుత్తు అందించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

Published : 09 Feb 2023 04:32 IST

పలు శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం
రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో చిన్నతరహా గ్రానైట్‌ పరిశ్రమలకు యూనిట్‌ రూ.2కే విద్యుత్తు అందించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

* వివిధ పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 చొప్పున 20 ఏళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయం. ఒంగోలు, నెల్లిమర్ల, పాలకొండ, శ్రీకాకుళం, వినుకొండ, అనంతపురం, ప్రొద్దుటూరు, కావలి, పిఠాపురం, రాయచోటి, గూడూరు, పెద్దాపురం, కడప, బద్వేలు, వెంకటగిరి, చిలకలూరిపేటల్లో స్థలాల కేటాయింపు. 

* అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు జిల్లాల్లోని న్యాయ సేవా సంస్థల్లో సహాయ సిబ్బంది నియామక ప్రతిపాదనలకు ఆమోదం.

* తితిదే ఐటీ విభాగంలో 34 పోస్టుల భర్తీకి ఆమోదం.

*  శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషినల్‌ స్కల్ప్చర్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎస్‌వీఐటీఎస్‌ఏ)లో 12 పోస్టుల భర్తీకి ఆమోదం.

* ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఏపీఎస్‌పీఎఫ్‌)లో 105 అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం

* ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి వీలుగా వైద్య, ఆరోగ్యశాఖలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందిని 12 నుంచి 14 మందికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ఇందులో భాగంగా కొత్తగా 1,610 పోస్టుల భర్తీ.

* ఆరోగ్యశ్రీ హైల్త్‌కేర్‌ ట్రస్టులో జిల్లా సమన్వయకర్తలుగా 10 అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం.

* కర్నూలు జిల్లా డోన్‌లో కొత్తగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 31 మంది బోధన, 12 మంది బోధనేతర సిబ్బంది భర్తీకి ఆమోదం

* ఏపీ మునిసిపల్‌ ఎకౌంట్స్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ కింద పరిపాలన సౌలభ్యం కోసం డిప్యూటీ డైరెక్టర్‌ (ఎకౌంట్స్‌) పోస్టు ఏర్పాటుకు ఆమోదం

* ఏపీ జువెనైల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ సంచాలకుల పోస్టు భర్తీకి ఆమోదం

* ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌లో 29 అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం

* రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలలకు సంబంధించి 10 ప్రిన్సిపల్‌, 138 బోధనా సిబ్బంది, 36 బోధనేతర సిబ్బంది పోస్టుల్ని పొరుగు సేవల విధానంలో భర్తీకి ఆమోదం

* ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలోని వివిధ పోస్టుల భర్తీకి ఆమోదం

* ఏపీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో డేటా ప్రాసెసింగ్‌ అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులతో పాటు, 13 జిల్లాల్లో 13 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయిలో 14 ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ పోస్టుల్ని భర్తీ చేస్తారు.

* పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖలో ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ విభాగానికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (సీఈవో) పోస్టు ఏర్పాటుకు ఆమోదం.

*  విశాఖపట్నంలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఏర్పాటు చేస్తున్న బ్యాడ్మింటన్‌ అకాడమీ అండ్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఖాళీ స్థల పన్ను రద్దు.

* నగరాలు, పట్టణాల్లో సర్వే విభాగంతో కలసి రీసర్వే చేపట్టేందుకు వీలుగా ఏపీ పురపాలక, పురపాలక కార్పొరేషన్ల చట్టాలకు సవరణలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు