SSLV D2: నేడు నింగిలోకి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌) నుంచి చేపట్టనున్న చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు.

Updated : 10 Feb 2023 11:07 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌) నుంచి చేపట్టనున్న చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ షార్‌లోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. గురువారం రిహార్సల్స్‌ నిర్వహించి, రాకెట్‌ పనితీరు బాగున్నట్లు నిర్ధారించారు. అనంతరం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో రాకెట్‌ సన్నద్ధత సమావేశం జరిగింది. సాయంత్రం భాస్కర కాన్ఫరెన్సు హాలులో లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌) సమావేశం నిర్వహించాక ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది 6.30 గంటలపాటు కొనసాగాక.. 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) నింగిలోకి బయలుదేరనుంది.

* ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవోఎస్‌-07 ఉపగ్రహంతో పాటు యూఎస్‌ఏ అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్‌-1, చెన్నై స్పేస్‌కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్‌-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. రాకెట్‌ ప్రయోగం 15 నిమిషాల్లో పూర్తికానుంది. 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్‌-07, 880 సెకన్లకు జానుస్‌-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీశాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని