Helmet: హెల్మెట్‌ ధరించకపోతే ముఖ ఆకృతికి ముప్పు

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రులకు వచ్చే వారిలో హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించని వారే 90% మంది ఉంటున్నారు.

Updated : 14 Feb 2023 11:38 IST

ఆసుపత్రులకు వస్తున్నకేసుల్లో అత్యధికం ఇవే

ఈనాడు-అమరావతి:  ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రులకు వచ్చే వారిలో హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించని వారే 90% మంది ఉంటున్నారు. ఆయా ప్రమాదాల్లో వీరి ముఖ ఆకృతి బాగా దెబ్బతింటోంది. దవడలు, పళ్లు విరిగిపోతున్నాయి. దాంతో  సర్జరీ చేసి సరిచేయాల్సి వస్తోంది. అదే హెల్మెట్‌, సీటు బెల్టు ధరించిన వారు చిన్న చిన్న గాయాలతో బయటపడుతున్నారని పలువురు దంత వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి వారు ప్రమాదానికి గురైనా పై దవడ, కింద దవడ చీలకుండా, పళ్లు దెబ్బతినకుండా బయటపడుతున్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ‘అంతర్జాతీయ నోరు-ముఖ దవడల శస్త్రచికిత్స నిపుణుల దినోత్సవం’లో ఆయా వైద్య నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ ఆకృతి బాగా దెబ్బతిన్న కేసులే ఆసుపత్రులకు ఎక్కువగా వస్తున్నాయని, బాధితులకు మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జరీ చేయకతప్పడం లేదని గుంటూరు జీజీహెచ్‌ డెంటల్‌ విభాగ హెచ్‌ఓడీ ఎన్‌.కిరణ్‌కుమార్‌ తెలిపారు. వారానికి నాలుగైదు సర్జరీలు చేస్తున్నామన్నారు. విజయవాడ జీజీహెచ్‌లోనూ ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ బాలసుబ్రహ్మణ్యం శర్మ పేర్కొన్నారు. ఇలా గాయపడిన వారు ఆహారాన్ని కూడా తీసుకోలేకపోతున్నారని, లిక్వెడ్స్‌పైనే ఆధారపడుతున్నారని చెప్పారు. నోటిలో మంట, నొప్పి లేదా చాలాకాలంగా మానని పుండు ఉన్నప్పుడు, ముఖం, మెడకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌, వాపులు, ఎత్తుగా లేక.. దవడ ఎముకలు సరిచేసే క్రమంలో మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జరీ చేస్తున్నామని వైద్యులు వివరించారు.  పాన్‌ గుట్కా, తంబాకు, నమిలే వారికి కూడా ఇటువంటి సర్జరీ చేయాల్సి వస్తోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని