Viveka Murder Case: తండ్రీ కుమారులకు సీబీఐ పిలుపు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ నుంచి పిలుపు అందింది.

Updated : 19 Feb 2023 09:26 IST

వివేకా హత్యకేసులో ఈ నెల 23న భాస్కర్‌రెడ్డి,24న అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఈనాడు డిజిటల్‌ - కడప

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ నుంచి పిలుపు అందింది. ఎంపీని ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న పులివెందులలో విచారిస్తామని...ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఆ రోజు విచారణకు హాజరుకాలేనంటూ భాస్కర్‌రెడ్డి సమయం కోరినట్లు తెలిసింది. గతంలో సీబీఐ అధికారులు సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద అవినాష్‌కు నోటీసు జారీచేయగా గత నెల 28న విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఒక్కరోజు వ్యవధిలోనే తండ్రీకుమారులను విచారణకు సీబీఐ పిలిచింది. హత్యలో భారీ కుట్ర కోణం దాగి ఉన్నందున, దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందని ఛార్జిషీట్‌లో పేర్కొంది. భాస్కర్‌ రెడ్డిని గతంలో రెండుసార్లు విచారించిన సీబీఐ.. ఇప్పుడు మరోసారి విచారణకు పిలిచింది. ఆయన హాజరు విషయంలో ఇచ్చిన సమాధానంపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని