Taraka Ratna: తారకరత్నకు అశ్రునివాళి

మృత్యువుతో 23 రోజులు పోరాడి.. బెంగళూరు నారాయణ హృదయాలయలో శనివారం మరణించిన సినీనటుడు నందమూరి తారకరత్న(40) కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated : 20 Feb 2023 08:21 IST

విషాదంలో కుటుంబసభ్యులు, అభిమానులు
నివాళులర్పించిన  పలువురు ప్రముఖులు

శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: మృత్యువుతో 23 రోజులు పోరాడి.. బెంగళూరు నారాయణ హృదయాలయలో శనివారం మరణించిన సినీనటుడు నందమూరి తారకరత్న(40) కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన కొంతకాలంగా నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలోని ‘గౌతమీ కంట్రీసైడ్‌’ విల్లాకు ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. భౌతికకాయాన్ని చూసేందుకు ఉదయం నుంచే రాజకీయ, సినీ ప్రముఖులు, బంధువులు, అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఉదయం కుటుంబసభ్యులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ వచ్చి తారకరత్న కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ దంపతులు, సినీనటులు చిరంజీవి, బాలకృష్ణ, మురళీమోహన్‌, వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు: చంద్రబాబు

‘తారకరత్న మరణం దురదృష్టకరం. ఆయన ఆసుపత్రి నుంచి కోలుకుని తిరిగి వస్తారని ఆశించాం. భగవంతుడు కరుణించలేదు. ఒకేరోజు తొమ్మిది సినిమాలు ప్రారంభించిన ఘనత తారకరత్న సొంతం. రాజకీయాలపై ఆసక్తితో.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని నాతో చెప్పారు. ఎన్నికల సమయంలో మాట్లాడదామని చెప్పాను. ఇంతలోనే మృతి చెందడం మా కుటుంబానికి తీరని లోటు. వారి పిల్లలను చూస్తే బాధ కలుగుతోంది. ఆయన ఆశయాల కోసం మేమంతా కలిసి పనిచేస్తాం. తారకరత్న భార్యకు భగవంతుడు ధైర్యం చేకూర్చాలి.’

మాట్లాడుకున్న చంద్రబాబు, విజయసాయిరెడ్డి

తారకరత్నకు నివాళులు అర్పించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు వెళ్లినప్పుడు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి.. విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అక్కడ చంద్రబాబు, విజయసాయిరెడ్డి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆవేదనతో ఉన్న బాలకృష్ణను విజయసాయిరెడ్డి ఓదార్చారు. ఆయన పక్కనే కూర్చుని మాట్లాడారు. అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌తోనూ విజయసాయిరెడ్డి మాట్లాడారు.

ప్రముఖుల నివాళులు..

తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, భారాస ఎమ్మెల్యేలు యాదయ్య, అరికెపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కేఎస్‌ రత్నం తదితరులు తారకరత్న పార్థివదేహానికి నివాళులు ఆర్పించారు.

తారకరత్న మరణం బాధాకరం: మోదీ

‘నందమూరి తారకరత్న అకాల మరణం తీవ్రంగా బాధించింది. సినీ, వినోద ప్రపంచంపై ఆయన తనదైన ముద్ర వేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు.

నేటి సాయంత్రం అంత్యక్రియలు

సోమవారం ఉదయం 9.03 గంటలకు శంకర్‌పల్లిలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహాన్ని తరలిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. 10 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచుతామన్నారు. 3 గంటల తర్వాత హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. తారకరత్న మృతితో ఆయన భార్య అలేఖ్యారెడ్డి తీవ్ర ఒత్తిడికి గురై, నీరసించారు. వారి ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూస్తానని బాలకృష్ణ తెలిపారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని