Srikakulam: ఒక్క ఊరి నుంచి 93 మంది వైద్యులు
ఒక పెద్దాయన ముందుచూపు ఒక ఊరి దశను మార్చేసింది.. 123ఏళ్ల క్రితం ఆయన వేసిన బాట కొన్ని తరాలవారిని ఉన్నత స్థానాలకు చేర్చింది. భావితరాల బాగు కోసం దూరం ఆలోచించి ఆయన ఒక బడిని నెలకొల్పారు.
ఓ పల్లె దశ, దిశను మార్చిన పాఠశాల
కుగ్రామం నుంచి వందల మంది ఉన్నత స్థానాలకు..
దేశ విదేశాల్లో కొలువుల్లో స్థిరపడిన వారెందరో..
సిక్కోలు ప్రాంతంలోని ఓ ఊరి స్ఫూర్తి ఇదీ..
వివిధ ఉద్యోగాల్లో మరికొందరు..
* సీపాన జ్యోతి, బెండి మాధురి అమెరికాలో, బెండి సురేంద్ర లండన్‌లో వైద్యులు.
* సీపాన నీలవేణి, పైడి వెంకటరావు ఆమదాలవలసలో వ్యవసాయ శాస్త్రవేత్తలు.
* సీపాన రమేశ్ మంగళగిరి ఎయిమ్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్.
* పంచాది రవిబాబు గుజరాత్‌లో చీఫ్ మెరైన్ ఇంజినీరు.
* బొడ్డేపల్లి ప్రసన్నకుమార్ ఇండియన్ నేవీలో ఇంజినీరు.
* నూక కిరణ్‌కుమార్ రైల్వేశాఖలో ఇంజినీర్.
ఒక పెద్దాయన ముందుచూపు ఒక ఊరి దశను మార్చేసింది..
123ఏళ్ల క్రితం ఆయన వేసిన బాట కొన్ని తరాలవారిని ఉన్నత స్థానాలకు చేర్చింది. భావితరాల బాగు కోసం దూరం ఆలోచించి ఆయన ఒక బడిని నెలకొల్పారు.
ఆ బడి.. ఆశయాల గుడిగా మారింది.. తన ఒడిలో ఎంతోమందికి అక్షరాలు నేర్పి ఉన్నత విద్యావంతుల్ని చేసింది.
సిక్కోలులోని ఆ పల్లెకు చెందిన ఎందరినో దేశవిదేశాల్లో ఉన్నత స్థానాలకు చేర్చింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కణుగులవలస గ్రామం కథ ఇది...
650 ఇళ్లుండే కణుగులవలస జనాభా 2,900. ఆ పల్లె నుంచి విద్యావంతులై ఏకంగా 93మంది వైద్యులుగా దేశవిదేశాల్లో సేవలందిస్తున్నారు. మరికొందరు శాస్త్రవేత్తలుగా, పోలీసు అధికారులుగా, ఉపాధ్యాయులుగా ఎదిగారు.
ఒకప్పుడు ఆ ఊరు పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. పంటలే ఆధారం. వర్షాలు పడి నాలుగు గింజలు పండితే తినడం.. కరవు తలెత్తి పంటలు ఎండితే పస్తులుండడం.. అదే వారికి తెలిసింది!
ఆ గ్రామంలో 1900 సంవత్సరంలో దివంగత బొడ్డేపల్లి రామమూర్తి మొట్టమొదట ఓ పాఠశాలను ప్రారంభించారు. అలా గ్రామంలో విద్యాబీజం పడింది.. వందలమంది ఉన్నత విద్యావంతులుగా ఎదిగేందుకు దోహదపడింది. ఇంటర్ నుంచి ఎంబీబీఎస్ సీటు సాధించే వరకు ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేసేవారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండే రోజుల్లో.. ఇల్లు గడవటం కష్టంగా ఉండే పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలని తపన పడేవారు.
వైద్యరంగంలో తమదైన ముద్ర
తొలితరంలో గుంటముక్కల అప్పన్న, అన్నాజీరావు ఆయుర్వేద వైద్యం, అధికార్ల జగబందు ఈ గ్రామంలో పశువైద్యం చేసేవారు. అల్లోపతి వైద్యులుగా డాక్టర్ బెండి చంద్రశేఖరరావు (ఎంబీబీఎస్), నూక భాస్కరరావు (ఎం.ఎస్.), నూక చంద్రశేఖరరావు సేవలందించేవారు. సంపతిరావు శ్రీదేవి (ఎం.ఎస్. గైనకాలజీ), బొడ్డేపల్లి సూర్యారావు (ఎం.ఎస్ ఆర్థో), సీపాన జయలక్ష్మి, సీపాన గోపి (న్యూరాలజిస్టు), బెండి తేజేశ్వరరావు (ఎం.ఎస్. సర్జన్), సీపాన సోమశేఖర్ (ఎండీ పీడియాట్రిక్), సీపాన రమేశ్ (ఈఎన్‌టీ), పంచాది శ్రీదేవి, బొడ్డేపల్లి సురేశ్, శ్రీనివాసరావు తదితరులు వైద్య నిపుణులుగా స్థిరపడ్డారు. దిల్లీ ఎయిమ్స్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో వైద్యులుగా స్థిరపడ్డారు.
ఊరిపై మమకారంతో సేవలు
శ్రీకాకుళం నగరంలోనూ కొందరు ఆసుపత్రులు ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు. సుమారు 25 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఊరి నుంచి ఎవరైనా అనారోగ్యంతో వస్తే కొందరు ఉచితంగా వైద్యం చేస్తారు. మరికొందరు ప్రత్యేక రాయితీపై మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. అప్పుడప్పుడు గ్రామంలో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటారు.
ఇక్కడి నుంచే ఎదిగారు..
ఇంజినీర్లుగా కొంచాడ రాజారావు మధ్యప్రదేశ్‌లో, సంపతిరావు మల్లేశ్వరరావు విశాఖపట్నంలో పనిచేశారు. సీపాన అప్పారావు ఇక్రిశాట్‌లో సీనియర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తించారు. బొడ్డేపల్లి వెంకట నరేశ్ వ్యవసాయ విభాగంలో పరిశోధన చేస్తున్నారు. పోలీసుశాఖలో నూక సుదర్శనరావు డీఎస్పీగా సేవలందించారు. సనపల కిరణ్‌కుమార్ ఏసీపీగా, ఎ.నరసింహమూర్తి డీఎస్పీగా పనిచేస్తున్నారు. సీపాన వెంకటరమణ డీఆర్‌డీవోలో సీనియర్ శాస్త్రవేత్తగా, బెండి సుధాకర్ జూనియర్ సైంటిస్టుగా ఉన్నారు. మరికొందరు ఉపాధ్యాయులుగా, ఎంపీడీవోలుగా, ఎంఈవోలుగా పని చేస్తున్నారు.
అన్నింటా చైతన్యవంతులే
చదువులోనే కాదు సామాజిక చైతన్యంలోనూ ఈ గ్రామస్థులు ముందుండేవారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బెండి అప్పలసూరి అనేక నిర్బంధాలను ఎదుర్కొని సర్దార్ బిరుదు పొందారు. కణుగులవలస ఒకప్పుడు నక్సల్బరీ ఉద్యమ కేంద్రంగానూ ఉండేది. బొడ్డేపల్లి సంపూర్ణమ్మ, చౌదరి తేజేశ్వరరావు దళ నాయకులుగా పోరాటాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించారు.
కష్టమైనా బైపీసీనే తీసుకోమనేవారు
నేను 1997లో ఎంబీబీఎస్ సీటు సాధించాను. అప్పట్లో సీట్లు తక్కువే. అయినప్పటికీ ఏటా రెండు, మూడు సీట్లు మా కణుగులవలస గ్రామస్థులకు కచ్చితంగా వచ్చేవి. ఉపాధ్యాయులు కష్టమైనా మమ్మల్ని ఇంటర్‌లో బైపీసీ గ్రూపే తీసుకోమని చెప్పి శిక్షణ ఇచ్చేవారు. ఎన్ని ఇబ్బందులున్నా తల్లిదండ్రులు కష్టపడి చదివించేవారు.
డాక్టర్ బొడ్డేపల్లి సురేశ్, ఎండీ (జనరల్ మెడిసిన్) సన్‌రైజ్ ఆసుపత్రి, శ్రీకాకుళం
ప్రోత్సాహమే కారణం
నేను ఉపాధ్యాయుడిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశాను. మా పిల్లలు పోలీసుశాఖ, ఇంజినీరింగ్ విభాగాల్లో చేస్తున్నారు. మనవలు విదేశాల్లో ఉన్నారు. దీనంతటికీ పెద్దల ప్రోత్సాహమే కారణం. కూలి పనికి వెళ్లినా.. ఉద్యోగం చేసినా పిల్లల్ని బాగా చదివించాలనే మా పూర్వీకులు భావించేవారు. ఉపాధ్యాయులు ఏ ఉద్యోగాలకు ఎలా వెళ్లాలనేదానిపై దిశానిర్దేశం చేసేవారు.
నూక శ్రీరామ్మూర్తి, కణుగులవలస
విద్యార్హత చూసే ఎన్నుకున్నారు..
పిల్లలు తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకుని ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. వారి వారసులు సైతం క్రమశిక్షణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఊరికి మంచి పేరు తీసుకువస్తున్నారు. నేను ఎంఏ, బీఈడీ పూర్తి చేశాను. సర్పంచిగా ఎన్నిక కావడానికి విద్యార్హతే కారణమని భావిస్తుంటాను.
నూక రాజు, సర్పంచి
పెద్దల ప్రోత్సాహ ఫలితం
చిన్నప్పటి నుంచి మా పెద్దలు, గురువులు చదువుకోవాలనే తృష్ణను మాలో నింపారు. రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉండేవాళ్లం. పెద్దల ప్రోత్సాహంతో ఎంతోమంది ఉపాధ్యాయులుగా, వైద్యులుగా ఎదిగాం. ఇప్పటికీ అదేబాటలో పయనిస్తున్నారు. మొదటి నుంచి మా గ్రామంలో చైతన్యం ఎక్కువగానే ఉండేది. అనేక ఉద్యమాలకు కేంద్రంగా ఉండేది.
బొడ్డేపల్లి జనార్దనరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు
ఈనాడు-శ్రీకాకుళం-ఆమదాలవలస, న్యూస్‌టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!