Andhra News: నిన్న పంచిన సొమ్ముకు.. నేడు బటన్‌ నొక్కుడేమిటో!

పీఎం కిసాన్‌ పథకం కింద 13వ విడత సాయంగా సోమవారమే రైతు ఖాతాల్లో సొమ్ము జమ అయింది. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రూ.16వేల కోట్లను జమ చేశారు.

Updated : 28 Feb 2023 09:46 IST

కర్ణాటకలో పీఎం కిసాన్‌ సాయం విడుదల చేసిన ప్రధాని మోదీ
అదే సొమ్మును నేడు మళ్లీ ఇస్తున్న సీఎం
తుపాను నష్టానికీ అరకొర సాయమే

ఈనాడు, అమరావతి: పీఎం కిసాన్‌ పథకం కింద 13వ విడత సాయంగా సోమవారమే రైతు ఖాతాల్లో సొమ్ము జమ అయింది. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రూ.16వేల కోట్లను జమ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనూ సుమారు 50లక్షల మందికి పైగా రైతులకు రూ.2 వేల చొప్పున రూ.1,000 కోట్లకు పైగా నిధులు అందాయి. ఇవే నిధులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు (మంగళవారం) గుంటూరు జిల్లా తెనాలిలో బటన్‌ నొక్కబోతున్నారు. పీఎం-కిసాన్‌-రైతు భరోసా పథకం కింద నాలుగో ఏడాది మూడో విడత కింద రూ.1,090.76 కోట్లు విడుదల చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి అందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రూ.90 కోట్లు(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, అటవీభూముల హక్కుదారులకు) కూడా ఉండటం లేదు. అయినా మిగిలిన రూ.1,000 కోట్లకు పైగా మొత్తాన్ని తమ ఖాతాలోనే వేసుకుని, తామే విడుదల చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రైతులు విస్తుపోతున్నారు. పీఎం కిసాన్‌ కింద రూ.2వేలు సోమవారమే ఖాతాల్లోకి వస్తే.. మంగళవారం మళ్లీ బటన్‌ నొక్కడం ఎందుకో అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది. మంగళవారం మళ్లీ రూ.2వేల చొప్పున ఖాతాల్లో జమ చేస్తారా అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.

మాండౌస్‌తో నిండా మునిగినా..

గతేడాది డిసెంబరు నెలలో మాండౌస్‌ తుపాను విరుచుకుపడటంతో సుమారు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. అయితే 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన రైతుల పంటలే దెబ్బతిన్నాయని ప్రభుత్వం లెక్క తేల్చింది. వీరికి రూ.76.99 కోట్ల పెట్టుబడి రాయితీని మంగళవారం విడుదల చేయనుంది. నిజానికి మాండౌస్‌ తుపానుతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కోత దశలో ఉన్న వరి నేల వాలింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం రంగు మారింది. ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో పలు చోట్ల పొగాకు దెబ్బతినడంతో రైతులు ఎకరాకు రూ.25వేలకు పైగా పెట్టుబడుల్ని కోల్పోయారు. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం, వైయస్‌ఆర్‌, అన్నమయ్య తదితర జిల్లాల్లో శనగ దెబ్బతింది. బొప్పాయి, అరటి తదితర పండ్లతోటలూ దెబ్బ తిన్నాయి. కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో మిరప రైతులు తుపాను సుడిలో చిక్కుకున్నారు. అయినా ప్రభుత్వం పంటనష్టం పెద్దగా లేదన్నట్లు వ్యవహరిస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. 33శాతానికి పైగా నష్టం జరిగిన ప్రాంతాల్లోనూ నమోదు సరిగా చేయలేదని, అరకొర సాయంతో సరిపెడుతోందని వాపోతున్నారు.

నాలుగేళ్లుగా రైతుల కళ్లకు గంతలు

పీఎం కిసాన్‌-రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.27,062 కోట్లు విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున ఇస్తున్నామని..దేశ చరిత్రలోనే ఇదో రికార్డు అని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారు. వాస్తవానికి ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 చొప్పున ఒకేసారి మే నెలలోనే ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో వైకాపా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక రెండు విడతల్లో రూ.7,500 చొప్పున మాత్రమే ఇస్తోంది. మిగిలిన రూ.6వేలను పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. వాటిని కూడా తమ ఖాతాలో కలిపేసిన ముఖ్యమంత్రి జగన్‌.. ఏడాదికి మూడుసార్లు బటన్‌ నొక్కుతూ నాలుగేళ్లుగా రైతుల కళ్లకు గంతలు కడుతున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి మంగళవారం రాష్ట్రంలోని 1.72లక్షల కుటుంబాలకే రూ.2వేల చొప్పున విడుదల చేస్తున్నారు. ఆ విషయాన్ని కప్పి పెట్టి.. 51.12లక్షల కుటుంబాలకు రూ.1,090.76 కోట్లు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని