Rushikonda: రుషికొండ ‘ప్రణాళిక’ మారిపోయింది

విశాఖ రుషికొండలో పర్యాటక శాఖ చేపట్టిన వివాదాస్పద నిర్మాణాలకు మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రణాళికను మంజూరు చేసింది.

Updated : 01 Mar 2023 09:49 IST

61 ఎకరాల్లో నిర్మాణాలకు జీవీఎంసీ అనుమతులు
తొలిప్లాన్‌లో 2.88 ఎకరాల్లోనే నిర్మాణాలని హైకోర్టుకు నివేదన

విశాఖపట్నం(కార్పొరేషన్‌), న్యూస్‌టుడే:  విశాఖ రుషికొండలో పర్యాటక శాఖ చేపట్టిన వివాదాస్పద నిర్మాణాలకు మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రణాళికను మంజూరు చేసింది. సోమవారం రాత్రి సంబంధిత దరఖాస్తుకు కమిషనర్‌ రాజాబాబు ఆమోదం తెలిపారు. దాదాపు నిర్మాణాలు పూర్తవుతున్న దశలో దీన్ని మంజూరు చేయడం గమనార్హం. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక ఇంజినీరు కె.రమణ జీవీఎంసీకి పంపిన మొదటి ప్లానులో 12.46 ఎకరాలకు 9.88 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. దీనిపై విశాఖ జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ హైకోర్టులో కేసు వేశారు. దానికి కౌంటరుగా సీఆర్‌జడ్‌, పర్యావరణ అనుమతులున్న 2.88 ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు చేపడతామని హైకోర్టుకు పర్యాటకశాఖ నివేదించింది. అయితే దానికి విరుద్ధంగా కొత్త ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో 69.64 ఎకరాలకు ఏకంగా 61.03 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. న్యాయస్థానానికి నివేదించిన ప్రకారం ప్రస్తుతం 2.88 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో మరింత విస్తరించాలనే వ్యూహంతో మొత్తం ప్రణాళికను మార్చేశారు.

* రుషికొండపై నిర్మాణాలకు సంబంధించి జీవీఎంసీకి రూ.19.05 కోట్ల భవన నిర్మాణ రుసుములను అయిదేళ్లలో దశల వారీగా చెల్లించేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాన్‌లో వేంగి, గజపతి, కళింగ, విజయనగరం బ్లాకులలో గ్రౌండ్‌, మొదటి అంతస్తుల నిర్మాణానికి అనుమతి కోరారు. వేంగి రెండు బ్లాకులు కలసి 1713.22 చదరపు మీటర్లు, కళింగ 7266.32 చదరపు మీటర్లు, గజపతి 903.34 చదరపు మీటర్లు, విజయనగరం పేరుతో మూడు బ్లాకులను 1198.52 చదరపు మీటర్లలో నిర్మించనున్నట్లు వివరించారు. రుషికొండను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్మాణాలు కొనసాగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని