Dwaraka Tirumala Rao: అన్నీ వాస్తవాలే.. కానీ ‘ఈనాడు’ వార్త తప్పు: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ

‘డీజిల్‌పై ఆయిల్‌ కంపెనీలిచ్చే కమీషన్‌కంటే ఆర్టీసీకి ఎక్కువ రాయితీ ఇవ్వడానికి కొందరు రిటైల్‌ బంకుల డీలర్లు ముందుకొచ్చారన్న ‘ఈనాడు’ కథనం వాస్తవమే.

Updated : 08 Mar 2023 07:00 IST

ఈనాడు, అమరావతి: ‘డీజిల్‌పై ఆయిల్‌ కంపెనీలిచ్చే కమీషన్‌కంటే ఆర్టీసీకి ఎక్కువ రాయితీ ఇవ్వడానికి కొందరు రిటైల్‌ బంకుల డీలర్లు ముందుకొచ్చారన్న ‘ఈనాడు’ కథనం వాస్తవమే. నాణ్యత, పరిమాణంలో రాజీ పడటం, వేరొక రాష్ట్రం నుంచి డీజిల్‌ కొని తెచ్చి మన రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టడం ద్వారానే ఇలా ఎక్కువ రాయితీ ఇచ్చేందుకు వీలుంటుందని అంచనా వేశాం. మావాళ్ల పొరపాటుతోగానీ, మాకు తెలియకుండా ఎవరైనా చేసే దందా వల్లగానీ ఆర్టీసీకి, ప్రభుత్వాదాయానికి గండి పడకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నాం. అయితే ‘డీజిల్‌ మాఫియా’ శీర్షికన ‘ఈనాడు’ కథనం అవాస్తవం’ అని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఈనాడు’ కథనం తప్పు అంటూనే అందులోని వివరాలు వాస్తవమేనని పరోక్షంగా అంగీకరించారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఆర్టీసీ ఏటా 150 కోట్ల కి.మీ.మేర బస్సులు నడుపుతూ 27 కోట్ల లీటర్ల డీజిల్‌ను ఆయిల్‌ కంపెనీలనుంచి బల్క్‌గా కొంటోంది. మూడేళ్లకోసారి టెండరు నిర్వహించి ఎక్కువ రాయితీనిచ్చిన ఆయిల్‌ కంపెనీలనుంచి డీజిల్‌ తీసుకుంటోంది. గతేడాది ఫిబ్రవరిలో రిటైల్‌బంకుల్లో ధరకంటే బల్క్‌ ధర పెరిగి లీటరుపై రూ.20 వ్యత్యాసం రావడంతో స్థానికంగా రిటైల్‌ బంకుల నుంచి కొనుగోళ్లకు ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం తేడా లేకపోవడంతో ఈనెల 1 నుంచి మళ్లీ ఆయిల్‌ కంపెనీలనుంచి నేరుగా డీజిల్‌ తీసుకునేలా ఆదేశాలిచ్చాం’ అని తెలిపారు.

జీఎస్టీ అధికారులు హెచ్చరించారు

‘పక్క రాష్ట్రాలనుంచి డీజిల్‌ తెచ్చి ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారని రాష్ట్ర జీఎస్టీ, వాణిజ్య పన్నులశాఖ అధికారులు మా దృష్టికి తెచ్చారు. అందుకే ఏపీలోనిదై ఉండి రాష్ట్రానికి అన్ని పన్నులు చెల్లించే బంకులనుంచే డీజిల్‌ తీసుకోవాలని ఆదేశాలిచ్చాం. అయినాసరే కొందరు బంకులవారు అవకతవకలకు పాల్పడటంతో బంకు ఏపీలో ఉండటంతోపాటు, వాళ్లకు సరఫరాదారూ మన రాష్ట్రంవారే ఉండాలనే నిబంధన విధించాం’ అని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ‘గుంతకల్లులో డీజిల్‌ దందా’ అని ఇటీవల పత్రికల్లో రావడంతో నిశితంగా పరిశీలించి సరిచేసేందుకు ప్రయత్నించామన్నారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఇలాంటి వార్తలు ప్రచురించినట్లయితే పరువునష్టం దావా వేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు.

పొరపాటు జరుగుతోందని హెచ్చరించాం..

ఆర్టీసీ ఎండీని విలేకరులు అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి పొంతనలేని సమాధానాలు తెలిపారు.

ప్రశ్న: తప్పులు జరుగుతున్నట్లు గుర్తించారన్నారు. ఎందరిపై చర్యలు తీసుకున్నారు? 

ఎండీ: రిటైల్‌ డీలర్లు ఎక్కువ రాయితీ ఇస్తారంటే తీసుకోవద్దని చెప్పాం. రూ.10కి కొని మాకు రూ.9కి ఇవ్వలేరు కదా? ఎక్కడో పొరపాటు ఉంటుందని హెచ్చరించాం. గుంతకల్లు డిపోలో ట్యాంకరును జీఎస్టీ అధికారులు పట్టుకున్నారు. పెట్రోల్‌బంకు యజమాని పక్క రాష్ట్రం నుంచి డీజిల్‌ తెచ్చారని తేలింది.

ప్రశ్న: స్థానిక బంకులనుంచి కాకుండా 60-70 కి.మీ.దూరంలో ఉన్న బంకులనుంచి డీజిల్‌ ఎందుకు తెప్పించారు? తనకల్లులో మూసేసిన ఓ బంకును తెరిపించి దాని పేరిట మదనపల్లె-1, 2 డిపోలకు వేల లీటర్ల డీజిల్‌ సరఫరా అయింది. ఇలా ఎన్ని ఉన్నాయి?

ఎండీ: ప్రభుత్వాదాయానికి గండి కొట్టనంతవరకు ఎక్కడ తక్కువకు వస్తే అక్కడి నుంచి డీజిల్‌ తీసుకుంటాం. పక్కరాష్ట్రాల నుంచి తెచ్చినా, దందా చేసినా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: స్థానిక డీలర్లను కాదని పక్క జిల్లావాళ్లు ఎక్కువ రాయితీ ఇస్తామంటేనే అందులో ఏదో తేడా ఉందనే అర్థం కదా?

ఎండీ: ఓ జిల్లావారు ఎక్కువ రాయితీ ఇవ్వకుండా కుమ్మక్కయ్యేందుకు వీలుంటుంది. అయితే కంపెనీ ఇచ్చే కమీషన్‌కంటే ఎక్కువ రాయితీ ఎవరైనా ఇస్తున్నారంటేనే తేడా ఉన్నట్లు గుర్తించాం.


డిపోలకు ఇచ్చిన డీజిల్‌ వివరాల సేకరణ

ఆర్టీసీకి చెందిన 129 డిపోలకు అయిదేళ్లుగా సరఫరా అయినా డీజిల్‌ వివరాలను వాణిజ్య పన్నుల అధికారులు సేకరించి పరిశీలిస్తున్నారు. కొందరు రిటైల్‌ బంకుల డీలర్లు పొరుగు రాష్ట్రాల్లో కొని తెచ్చి ఆర్టీసీ డిపోలకు సరఫరా చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని