చెత్త పన్ను.. కొత్త మెలిక

చెత్త సేకరణ రుసుముల వసూళ్లపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పుర, నగరపాలక సంస్థల అధికారులు వెనక్కి తగ్గడం లేదు.

Published : 08 Mar 2023 04:28 IST

వ్యాపార అనుమతుల పునరుద్ధరణకు లంకె
పట్టణాలు, నగరాల్లో వ్యాపారుల ఆందోళన

ఈనాడు, అమరావతి: చెత్త సేకరణ రుసుముల వసూళ్లపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పుర, నగరపాలక సంస్థల అధికారులు వెనక్కి తగ్గడం లేదు. రుసుములు చెల్లించని దుకాణాల ముందు చెత్త వేయించి భయపెట్టిన అధికారులు.. ఇప్పుడు వ్యాపార లైసెన్సుల పునరుద్ధరణకు ఈ రుసుములతో ముడి పెడుతున్నారు. బకాయిలతో రుసుములు చెల్లించిన వ్యాపారుల లైసెన్సులే పునరుద్ధరిస్తున్నారు. కొవిడ్‌ తరువాత వ్యాపారాలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్న వ్యాపారులు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరిస్తున్నందుకు ఇళ్ల నుంచి నెలకు కనిష్ఠంగా రూ. 30, గరిష్ఠంగా రూ. 120.. దుకాణాలు, భారీ వ్యాపార సంస్థల నుంచి కనిష్ఠంగా రూ. 150, గరిష్ఠంగా రూ. 15,000 వరకు వసూలు చేయాలని పుర, నగరపాలక సంస్థలు నిర్ణయించాయి. కార్యక్రమం అమల్లో ఉన్న 40 నగరాలు, పట్టణాల్లో ప్రజలు, వ్యాపారుల నుంచి నెలకు దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యం. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్నులు విధించే విధానం అమల్లోకి వచ్చాక ఆస్తి పన్ను భారీగా పెరగడంతో ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు చెత్త సేకరణ రుసుములు కట్టాలని అధికారులు పట్టుబడుతుండటంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పన్నులతో కలిపి రుసుముల వసూలు!

ప్రతి నెలా చెత్త రుసుము వసూళ్లపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రత్యామ్నాయాలపై అధికారులు దృష్టి సారించారు. ఆర్నెల్లకోసారి వసూలు చేసే ఆస్తి పన్నుతో కలిపి చెత్త రుసుమునూ కట్టించుకుంటే ప్రతి నెలా ఇబ్బంది ఉండదని ప్రతిపాదించారు. దీనిపై ఉన్నత స్థాయిలోనూ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి రాగానే అమలు చేయాలని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని