Margadarsi: మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదూ లేదు

మార్గదర్శి చిట్‌ఫండ్‌పై చందాదారుల నుంచి చిన్న ఫిర్యాదు కూడా లేకపోయినా.. ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను, సీఐడీని ప్రయోగించిందని చెప్పడానికి ఈ ఇద్దరు అధికారుల సమాధానాలే సాక్ష్యం.

Updated : 14 Mar 2023 05:28 IST

సీఐడీ ఎంటరయ్యాకే కంప్లయింట్లు
రోగం ఉందని రోగి చెప్పాలా? డాక్టర్‌ చెప్పాలా?
సీఐడీ చీఫ్‌ సంజయ్‌, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ వ్యాఖ్యలు  
విలేకర్ల ప్రశ్నలకు సమాధానాల దాటవేత  
మరికొన్నింటికి పొంతనలేని జవాబులు
మిమ్మల్ని సంతృప్తిపరచలేమంటూ మధ్యలోనే వెళ్లిపోయిన అధికారులు


‘మార్గదర్శి చిట్‌ఫండ్‌పై నిర్దిష్టంగా ఏ చందాదారు నుంచీ మాకు ఫిర్యాదు రాలేదు. సీఐడీ చర్యలు ప్రారంభించాకే కొన్ని ఫిర్యాదులు వచ్చాయి’

విలేకర్ల ప్రశ్నకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ చెప్పిన సమాధానమిది.


‘వారికి డబ్బు చెల్లించలేదంటూ ఈ రెండు రోజుల్లో 8 ఫిర్యాదులు వచ్చాయి. చందాదారులు అవివేకులు, అమాయకులు.. వారికేమీ తెలీదని సుప్రీంకోర్టే చెప్పింది. ఒక ఆడిట్‌ నివేదికను ఆధారంగా చేసుకుని మార్గదర్శి చిట్‌ఫండ్‌పై చర్యలు తీసుకోమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. సీఐడీని కోరింది. ఉల్లంఘనలు జరిగినట్లుగా ఉన్న ఆ నివేదికను పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం చర్యలు ప్రారంభించాక ప్రజలు ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారు’

ఇది సీఐడీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌ జవాబు.


మార్గదర్శి చిట్‌ఫండ్‌పై చందాదారుల నుంచి చిన్న ఫిర్యాదు కూడా లేకపోయినా.. ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను, సీఐడీని ప్రయోగించిందని చెప్పడానికి ఈ ఇద్దరు అధికారుల సమాధానాలే సాక్ష్యం. మార్గదర్శి చిట్‌ఫండ్‌ లావాదేవీలపై రిజిస్ట్రేషన్ల శాఖ ఎవరో ఒక ప్రైవేటు ఛార్టెడ్‌ అకౌంటెంట్‌తో ఆడిట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయించిందట! అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లుగా ఆ నివేదికలో బయటపడిందట! దాని ఆధారంగా మార్గదర్శిపై చర్యలు తీసుకోమని సీఐడీకి రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు చేసిందట! వెంటనే సీఐడీ రంగంలోకి దిగి.. మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, కేసులు పెట్టి, కొందరు మేనేజర్లను అరెస్ట్‌ చేసిందట.. ఇదీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ సోమవారం విలేకర్ల సమావేశంలో చెప్పిన కథ. హైకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించి, కక్షపూరిత ధోరణితో మార్గదర్శి చిట్‌ఫండ్‌ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి.. సిబ్బందిని, చందాదారుల్ని భీతావహుల్ని చేసి.. కొందరు మేనేజర్లను అక్రమంగా నిర్బంధించడాన్ని సమర్థించుకోవడానికి వారిద్దరూ తెగ తంటాలు పడ్డారు. ఆ తర్వాత విలేకర్లు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా, దాటవేత ధోరణితో వ్యవహరించారు. పొంతనలేని జవాబులు చెప్పారు. మీరు ఎన్ని అడిగినా.. మేం చెప్పాలనుకున్నదే చెబుతాం అన్నట్టుగా వారి ధోరణి కొనసాగింది. చివరకు విలేకర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ‘మేం చెప్పాల్సింది చెప్పాం. మిమ్మల్ని సంతృప్తిపరచడం కష్టం. ఇది ఎప్పటికీ తెగే వ్యవహారం కాదు’ అని చెప్పేసి లేచి వెళ్లిపోయారు.

చందాదారులకు జ్ఞానం కలిగించడమే మా లక్ష్యం: సంజయ్‌

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అనే ప్రభుత్వ అధికారి చిట్‌ఫండ్‌ సంస్థలకు పర్యవేక్షకుడిగా ఉంటారనే సంగతి కూడా కట్టిన వారికి తెలియదని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ పేర్కొన్నారు. వారిలో చీకటిని పారదోలి, జ్ఞానం కలిగించడమే తమ ఉద్దేశమని చెప్పారు. ‘తమ డబ్బును పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత సంస్థపై ఉంటుందనే అవగాహన కూడా సమాజంలో, ప్రజల్లో లేదు. దానికి ఏం చేస్తాం.. కాబట్టే అవగాహన కల్పించడం మా బాధ్యత’ అని పేర్కొన్నారు. ‘విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురం, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నంలలోని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్ల నుంచి సీఐడీకి అందిన ఫిర్యాదు మేరకే విచారణ ప్రారంభించి పత్రాలను పరిశీలించాం. విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరుల్లో ఫోర్‌మన్లు అందుబాటులో ఉన్నారు. మిగిలిన చోట్ల కూడా సహకరించారు. అయితే అక్కడ కూర్చునే వ్యక్తులు వివిధ కారణాలతో అందుబాటులో లేరు. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్ల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. నలుగురు బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం. వారిలో ముగ్గురికి రిమాండు విధించారు’ అని తెలిపారు. ‘చిట్టీ పాడుకున్నాక మిగిలిన నెలలకు సంబంధించి చెల్లించాల్సిన చందా (ఫ్యూచర్‌ సబ్‌స్క్రిప్షన్‌) మొత్తానికి సరిపడా సొమ్మును డిపాజిట్‌ చేస్తే వడ్డీ చెల్లిస్తామని సంస్థ చెబుతోంది. తమకు రావాల్సిన సొమ్మును డిపాజిట్‌గా తీసుకుని వడ్డీ కూడా ఇస్తామంటుంటే.. జ్ఞానం లేని ఖాతాదారులు అందుకు అంగీకరించారు. చిట్‌లో సభ్యులుగా చేరని ఖాతాలకు సంబంధించిన వాటిని సంస్థ తమ తరఫున నిర్వహిస్తుంది. వాటి తాలూకు సొమ్మును ఒక ఖాతాలో ఉంచాల్సి ఉన్నా అలా చేయడం లేదు. చిట్‌ కట్టే చోట డబ్బు లేదు. అంతా ఒకేచోటకు వెళ్తోంది. తీసుకెళ్లి మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టారు. చిట్‌ఫండ్‌ సంస్థలకు అలాంటి హక్కు ఉండదు. చందాదారుకు తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. జవాబుదారీతనం లేని వాతావరణం కనిపించింది. ఆ కారణంగానే అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ నుంచి వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం’ అని చెప్పారు. ‘చందాదారు చెల్లించిన మొత్తానికి తగినంత రూపంలో తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఫోర్‌మన్లపై ఉన్నా.. తాము బ్రాంచ్‌ మేనేజర్లమే అని వారు చెబుతున్నారు. చెక్‌పవర్‌ కూడా తమకు రూ.500 వరకే ఉందంటున్నారు. నగదు లావాదేవీలను కూడా సరిగా చూపలేకపోయారు. ఇంకా విచారణ చేయాల్సి ఉంది. రెండు రోజుల్లో అన్ని లావాదేవీలు, ఖాతా పుస్తకాలు చూడటం సాధ్యం కాదు. కేసులో పేర్కొన్న సెక్షన్లకు అనుగుణంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నలుగురి రిమాండ్‌ రిపోర్టుల ద్వారా తెలిసింది’ అని పేర్కొన్నారు.

అవసరమైతే మార్గదర్శి చిట్‌ఫండ్‌ను మూసేస్తాం: వి.రామకృష్ణ

అవసరమైతే మార్గదర్శి చిట్‌ఫండ్‌ను మూసేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. ఇదే తరహాలో ఉల్లంఘనలు కొనసాగి, అవి నిరూపణై, వారు సహకరించకపోతే కంపెనీని మూసేయటానికీ వెనుకంజ వేయబోమని పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థపై ఇంతకు ముందు పలు ఆరోపణలొచ్చాయని తెలిపారు. ఇలాంటి నేపథ్యం ఉండటం వల్లే సీఐడీకి ఫిర్యాదు చేశామని, వారు కేసు దర్యాప్తు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము కూడా సమాంతరంగా చిట్‌ఫండ్‌ చట్టంలోని అంశాలను వర్తింపజేసి వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని