Oscars 2023: నాటు.. నాటు.. దునియాలో దుమ్మురేపె సూడు.. సూడు..
ఎక్కడ తెలుగు పాట... ఎక్కడ ఆస్కార్ వేడుక? ఈ కల కనడం కూడా సాహసమే ఒకప్పుడు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ‘నాటు నాటు’ పాట.
అచ్చ తెలుగు పాటకు ఆస్కార్
అవార్డు అందుకున్న స్వరకర్త కీరవాణి.. గీత రచయిత చంద్రబోస్
ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు పాటను లైవ్‌లో ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’
‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రానికి ఏడు పురస్కారాలు
ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్... ఉత్తమ నటి మిషెల్ యో
అట్టహాసంగా 95వ ఆస్కార్ వేడుక
ఈనాడు సినిమా విభాగం
ఎక్కడ తెలుగు పాట... ఎక్కడ ఆస్కార్ వేడుక? ఈ కల కనడం కూడా సాహసమే ఒకప్పుడు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ‘నాటు నాటు’ పాట. సోమవారం ఉదయం మన పాటకు ఆస్కార్ వస్తుందా రాదా అనే ఉత్కంఠే అందరిలోనూ. పురస్కారం ప్రకటించడానికి ముందే మన తెలుగు పాట ఆస్కార్ వేదికపై వినిపించి, థియేటర్ మొత్తం లేచి చప్పట్లు కొట్టించినప్పుడే ప్రపంచాన్ని గెలిచేసింది. ఆ తర్వాత దక్కిన పురస్కారం ఓ అద్భుతమైన బోనస్.
నాటు నాటు ప్రపంచాన్ని ఊపేసిన పాట!
భూమి దద్దరిల్లేలా...ఒంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా...
దుమ్ము దుమ్ముదులిపేలా..
లోపలున్న పాణమంతా దుముకుదుముకులాడేలా...
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందితో స్టెప్పులేయించిన పాట!
అంతలా విశ్వ సినీ ప్రేమికుల మనసుల్లో ‘నాటు’కు పోయింది.
ఇప్పుడు ఆస్కార్ సాధించి విశ్వవిజేతగా నిలిచింది.
ఎన్నేళ్లకు ఆస్కార్ నడిచొచ్చే... ఎన్నాళ్లకు పెద పండగ తెచ్చే... ఇలాగే ఆనందంతో పాడుకుంది ప్రతి భారతీయ హృదయం. ఎందుకంటే ప్రపంచ సినిమా యవనికపై భారతదేశాన్ని తెలుగు సినిమా అద్భుతంగా ఆవిష్కరించిన క్షణాలివి... ప్రతి భారతీయ సినీ ప్రేమికుడు... అందులోనూ తెలుగోడు గర్వించే మరిచిపోని ఘట్టాలివి.. సినీ ప్రపంచపు అత్యున్నత పురస్కార శిఖరాన్ని మనవాళ్లు అధిరోహించిన అద్భుత దృశ్యాలివి... వీటన్నింటికీ 95వ ఆస్కార్ వేడుక వేదికైంది. మాటలకు అందని ఇలాంటి పరిపూర్ణ ఆనందానికి కారణాలు రెండు.. ఒకటి మన అచ్చ తెలుగు పాట నాటు...నాటు... రెండోది ఏనుగు కథతో తెరకెక్కిన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం...‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ 95వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ ఒరిజినల్ పాట విభాగంలో ఆస్కార్ గెలిచింది. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ రచించిన నాటు నాటు.. పాట అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ నృత్య రీతులు సమకూర్చారు. అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ వుమెన్), లిఫ్ట్ మి అప్ (బ్లాక్‌పాంథర్: వకాండా ఫరెవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్) పాటల్ని అధిగమించి మన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలిచింది.
అరుదైన గౌరవం
ఆస్కార్ గెలుచుకొని భారతీయ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన ‘నాటు నాటు’ పాట మరో అరుదైన గౌరవాన్నీ సొంతం చేసుకుంది. ఈ పాట ప్రత్యక్ష ప్రదర్శనకు లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో వీక్షకులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. ఈ పాటను బాలీవుడ్ నటి దీపిక పదుకొణే ఆస్కార్ ఆడిటోరియానికి పరిచయం చేశారు. ‘మీకు నాటు నాటు’ అంటే ఏమిటో తెలుసా? తెలియకుంటే ఇప్పుడు తెలుసుకుంటారు’ అంటూ దీపిక చెప్పగానే డాల్బీ థియేటర్ ఒక్కసారిగా వీక్షకుల అరుపులు, కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ‘తిరుగులేని గాన బృందం.. ఉర్రూతలూగించే బీట్స్.. అదరహో అనిపించిన స్టెప్పులు ఈ పాటను ప్రపంచ సంచలనంగా మార్చేశాయి. విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ మధ్య స్నేహాన్ని చాటిచెప్పిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే పాటిది. దీన్ని తెలుగులో పాడటంతో పాటు వలసవాద వ్యతిరేక ఇతివృత్తాన్ని సజీవంగా ప్రదర్శించడంతో ఇది సంచలనం సృష్టించింది. యూట్యూబ్, టిక్‌టాక్‌లలో కోట్లాది వీక్షణలను సొంతం చేసుకోవడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థియేటర్లలో ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించింది. అంతేకాదు.. భారతీయ సినీ పరిశ్రమ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి పాటగా ఘనత సాధించింది’ అంటూ నేపథ్యాన్ని ఈ వేదికపై ఆకట్టుకునేలా పరిచయం చేశారు దీపిక. అనంతరం గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ వేదికపైకి వచ్చి పాట ఆలపించగా.. వెనుక విదేశీ డ్యాన్సర్ల బృందం ఆ పాటకు అనుగుణంగా అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. ‘నాటు నాటు’ గీతంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మాదిరిగానే దుస్తులు వేసుకున్న డ్యాన్సర్లు ఆ పాటకే తలమానికంగా నిలిచిన హుక్ స్టెప్‌ను వేదికపై అచ్చుగుద్దినట్లు దింపేసి అందరినీ ఆకట్టుకున్నారు.
పురస్కారం గెలిచిన సంతోషంలో రాజమౌళి, ఆయన అర్థాంగి రమా రాజమౌళి, కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తోపాటు ఇతర చిత్రబృందం ఒకరినొకరు హత్తుకుని సంతోషాన్ని పంచుకున్నారు. కరతాళధ్వనుల మధ్య స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ వేదికనెక్కి పురస్కారాన్ని అందుకున్నారు. నాటు నాటు పాట ఇదివరకే గోల్డెన్ గ్లోబ్‌తో పలు అంతర్జాతీయ పురస్కారాల్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్కార్ సొంతం చేసుకున్న తొలి పూర్తిస్థాయి భారతీయ చిత్రంగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చరిత్ర సృష్టించింది. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశ విదేశాల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి తొలి అవార్డు
అనాథ ఏనుగులను ఆదరించిన దంపతుల కథతో తెరకెక్కిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోంగా వేదికపై అవార్డు తీసుకొని మురిసిపోయారు. కార్తికికు దర్శకురాలిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ దక్కడం ఇదే తొలిసారి.
ఒకే చిత్రానికి ఏడు అవార్డులు
చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఓ కుటుంబం కథతో తెరకెక్కిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా 11 నామినేషన్లు పొందింది. ఏకంగా ఏడు అవార్డులను కైవసం చేసుకుంది. డానియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ ఈ సినిమాకు ‘ఉత్తమ దర్శకుడి’గా అవార్డును గెలుచుకున్నారు. అమెరికన్ చలన చిత్ర దర్శకులైన వీరిని ‘డేనియల్స్’ అని పిలుస్తారు. ఈ చిత్రంలో లాండ్రీ షాప్ యజమానిగా కీలక పాత్రలో నటించిన మిషెల్ యో ‘ఉత్తమ నటి’ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ పురస్కారం అందుకున్న ఆసియా సంతతికి చెందిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఉత్తమ సహాయ నటి, సహాయ నటుడు, స్క్రీన్‌ప్లే, ఎడిటర్ విభాగాల్లోనూ ఈ చిత్రం పురస్కారాలు గెలుచుకుంది. ‘ది వేల్’ చిత్రంతో బ్రెండన్ ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
అత్యున్నత శిఖరంపై నిలబెట్టినట్లుంది
కచ్చితంగా ఆస్కార్ గెలుస్తామని మేమంతా ముందు నుంచీ బలంగా నమ్ముతూ వచ్చాం. ఈ రోజున అదే నిజమైంది. అయితే ఆస్కార్ అందుకోవడం, ఈ వేదికపై ‘నాటు నాటు’ ప్రదర్శించడం.. ఈ రెండింటిలో నాకేవి ప్రత్యేకమైన క్షణాలంటే చెప్పడం కష్టం. ‘నాటు నాటు’ పాట ప్రదర్శిస్తున్నంతసేపూ ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం.. అది పూర్తయ్యాక వేడుకలో ఉన్న వాళ్లంతా లేచి నిల్చొని కరతాళధ్వనులతో అభినందించడం చూస్తే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంపై నన్ను నిలబెట్టినట్లుంది. అలాగే ఆస్కార్ అవార్డు ఆయన్ను (కీరవాణిని) శిఖరాగ్రాన నిలబెట్టింది.
రాజమౌళి
‘ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా’
- ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ఈ సంభాషణకు తగ్గట్టే పురస్కారాలకు కుంభస్థలంలాంటి ఆస్కార్‌పై గురిపెట్టారు అగ్ర దర్శకుడు రాజమౌళి. తనదైన శైలిలో లక్ష్యాన్ని ఛేదించి తెలుగు సినిమా కీర్తి పతాకను ప్రపంచస్థాయిలో రెపరెపలాడేలా చేశారు. ‘ప్రాంతీయ సినిమా’ అనే పరిధిని దాటని తెలుగు చిత్రాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఇప్పుడు సగర్వంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు.
జయహో.. జక్కన్న!
భాష లేదు.. ప్రాంతం లేదు... అందరి నోటా ‘నాటు నాటు’
పాట ఎక్కడ వినిపిస్తే అక్కడ పోలేరమ్మ జాతరే. ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినంత కమ్మగా రాశారు చంద్రబోస్. పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినంత హుషారుగా స్వరాలు సమకూర్చారు కీరవాణి. మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు ఉత్సాహాన్నంతా తమలో నింపుకొని ఆలపించారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. ఇక ఆ పాటలో ఆడిపాడిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లైతే... మనదైన అసలు సిసలు నాటు డ్యాన్స్ ఎలా ఉంటుందో పరిచయం చేశారు. అందుకే ఈ పాట ప్రపంచాన్ని ఏలింది. ఇప్పుడు విజేతగా నిలిచింది.
జయహో కీరవాణి, జయహో చంద్రబోస్
యావత్ దేశం గర్విస్తోంది
‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు..’ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకోవడం అసాధారణం. దీన్నిచూసి భారత్ గర్విస్తోంది. కొన్నేళ్లపాటు గుర్తుండిపోయే గీతం ఇది. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ సహా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందానికి నా అభినందనలు. ఇదే వేదికపై ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లఘు చిత్ర దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోంగాతోపాటు చిత్రబృందానికీ అభినందనలు తెలుపుతున్నాను.
ప్రధాని నరేంద్ర మోదీ
భారతీయ సినిమాకు ఇది ఓ మైలురాయి
‘నాటు నాటు..’ పాట చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాకు ఇదొక మైలురాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. అలాగే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బృందానికీ అభినందనలు.
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
భారత నృత్యం.. ప్రపంచ వ్యాప్తం
భారతదేశం నృత్యం చేసిన పాట ప్రపంచవ్యాప్తం అయ్యింది. ‘నాటు నాటు..’ గీతంతో ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందానికి అభినందనలు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’తో ఆస్కార్ గౌరవాన్ని పొందిన దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగాకు అభినందనలు.
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
తెలుగు పాటకు ఆస్కార్ అభినందనీయం
‘‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చిత్ర దర్శకుడు రాజమౌళి బృందానికి అభినందనలు. గీత రచయిత చంద్రబోస్ రాసిన పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన తీరు అద్భుతం.ఈ పాటతో ఈ బృందం తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటింది’’
- ముఖ్యమంత్రి జగన్
తెలుగువారికి గర్వకారణం
‘‘ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఆస్కార్ పురస్కారం రావడం తెలుగువారందరికీ గర్వకారణం. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం...నాటునాటు పాట చరిత్రలో నిలిచిపోతాయి. ప్రపంచం మొత్తం భారతీయతను గౌరవించే సమయం వచ్చింది. అన్ని రంగాల్లో తెలుగువారు టార్చ్‌బేరర్‌గా నిలుస్తున్నారు’’
- తెదేపా అధినేత చంద్రబాబు
చిత్ర బృందాలకు అభినందనలు
‘భారతీయులంతా గర్వపడేలా ఆస్కార్ పురస్కారం స్వీకరించిన ఆర్‌ఆర్‌ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర బృందాలకు అభినందనలు. ‘‘నాటు..నాటు’’ పాటతో తెలుగుపదం నలు చెరగులా వ్యాపించింది’’.
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్
భారత్‌కు గర్వకారణం
‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం తెలుగు చలన చిత్రరంగానికే కాక యావత్ భారతదేశానికి గర్వకారణం. చిత్రబృందానికి ‘తానా’ తరఫున అభినందనలు.
- తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు
నాటునాటు పాటకు ఆస్కార్ పురస్కారం గర్వకారణం
ఆర్‌ఆర్‌ఆర్ బృందానికి అభినందనలు తెలిపిన గవర్నర్
ఈనాడు, అమరావతి: నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంపై గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇది తెలుగువారు గర్వించదగ్గ రోజు. ఈ విజయానికి కారకులైన బృందం భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలి’ అని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, ఇతర ఆర్‌ఆర్‌ఆర్ బృంద సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఆస్కార్ విజేతలకు అభినందనలు
‘మనదేశానికి చెందిన ఆర్‌ఆర్‌ఆర్, ది ఎలిఫెంట్ విస్పరెర్స్ చిత్రాలకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు లభించడం ఆనందించదగ్గ విషయం. రాజమౌళి బృందానికి అభినందనలు’
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Education News
JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ (సెషన్ 2) అడ్మిట్ కార్డులు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Priyanka Gandhi: గాంధీ కుటుంబాన్ని BJP నిత్యం అవమానిస్తోంది : ప్రియాంక
-
Sports News
Cricket: ఫుల్ స్పీడ్‌తో వికెట్లను తాకిన బంతి.. అయినా నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్
-
Movies News
Akanksha Dubey: సినీ పరిశ్రమలో విషాదం.. యువ నటి ఆత్మహత్య
-
Politics News
BRS: రైతుల తుపాన్ రాబోతోంది.. ఎవరూ ఆపలేరు: కేసీఆర్