Viveka Murder Case: దర్యాప్తు అధికారిపై ఫిర్యాదుకు కారణాలేంటి?

‘‘వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య గురించి బాహ్యప్రపంచానికి ఉదయం 6 గంటలకు తెలిస్తే.. అంతకుముందే మీకు తెలిసిందనే ఆరోపణలకు మీరేం సమాధానం చెబుతారు..? హత్యాస్థలిలో రక్తపు మరకల్ని తుడిచేయడం..

Updated : 15 Mar 2023 05:58 IST

వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య గురించి బాహ్యప్రపంచానికి ఉదయం 6 గంటలకు తెలిస్తే.. అంతకుముందే మీకు తెలిసిందనే ఆరోపణలకు మీరేం సమాధానం చెబుతారు..? హత్యాస్థలిలో రక్తపు మరకల్ని తుడిచేయడం.. మృతదేహానికి కట్లు కట్టి ఆసుపత్రికి తరలించడం.. గుండెపోటుగా చిత్రీకరించడంలో మీ పాత్ర ఉందనే ఆరోపణలపై మీ స్పందనేంటి..?’’ అని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను మార్చాలంటూ సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖ గురించి ఆరాతీసినట్లు తెలిసింది. ఎందుకు ఫిర్యాదు చేశారో చెప్పగలరా.. అంటూ అడిగినట్లు సమాచారం. నాలుగో విడత విచారణలో భాగంగా అవినాష్‌రెడ్డి మంగళవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఈసారి న్యాయవాది సమక్షంలో విచారణ జరిగింది. వివేకాది గుండెపోటుగా ప్రచారం చేయడంలో అవినాష్‌, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిల పాత్ర ఉందని సీబీఐ అనుమానిస్తున్న నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యం సంతరించుకొంది. హత్యకు కొన్ని గంటల ముందు కీలక నిందితుడు సునీల్‌యాదవ్‌ 15 నిమిషాలపాటు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేకవుట్‌ ద్వారా సమాచారం సేకరించిన విషయంలోనూ ప్రశ్నించినట్లు సమాచారం. ఆయన కాల్‌డేటా గురించీ ఆరా తీసినట్లు తెలిసింది. ఇలా దాదాపు నాలుగు గంటలు విచారించిన తర్వాత పంపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని