Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంతటివారున్నా శిక్ష పడాల్సిందే

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాలని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు.

Updated : 16 Mar 2023 10:10 IST

తప్పు చేస్తే చిన్నపిల్లల్నీ మందలిస్తాం కదా
పెద్దలకు మినహాయింపు ఎందుకివ్వాలి?
తండ్రి వర్ధంతి కార్యక్రమంలో సునీత 

ఈనాడు డిజిటల్‌- కడప, న్యూస్‌టుడే- పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాలని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో కొందరు వ్యక్తులు తేలిగ్గా మాట్లాడారని, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఈ కేసులో ఎంతటివారైనా బయటకు రావాల్సిందేనని, తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందేనని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు తప్పు చేసినా మందలిస్తాం కదా.. పెద్దలకు మాత్రం మినహాయింపు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగి బుధవారానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి సునీత నివాళులర్పించారు. అనంతరం భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ‘కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని నాకు తెలుసు. ఈ కేసు విచారణ జరుగుతున్నందున నేను దేని గురించీ మాట్లాడకూడదు. నాకు తెలిసిన విషయాలను గతంలో సిట్‌కు చెప్పాను. ఇప్పుడు సీబీఐకి తెలియజేస్తున్నాను. హత్య కేసులో కొందరి ప్రమేయం ఉందని నమ్ముతున్నా కాబట్టే వారి గురించి సీబీఐకి అన్ని విషయాలు చెబుతున్నా. తెలిసిన విషయాలు దాచిపెట్టడం తప్పే’ అని అన్నారు.

ముప్పై ఏళ్ల కిందటి గొడవలు గుర్తొస్తున్నాయి..

‘నాన్న చనిపోయిన మొదట్లో కొందరు మాట్లాడుతూ కడప, కర్నూలుల్లో ఇలాంటివి మామూలే కదా.. ఎందుకు మీరు అంతగా బాధపడుతున్నారన్నారు. కడప అంటే అరాచకాలు గుర్తుకొస్తాయి. మా నాన్న హత్యతో ఈ జిల్లాలో ముప్పై ఏళ్ల కిందట జరిగిన గొడవలు మళ్లీ మొదలయ్యాయా అనిపిస్తోంది. ఇలాంటివన్నీ ఆగి, అభివృద్ధి జరగాలి. వివేకాను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెట్టగలను? నాన్న చనిపోయి నాలుగేళ్లవుతోంది. పోలీసు, సిట్‌, సీబీఐ విచారణలు జరిగాయి. నాకు ఎవరిపైనా కక్ష లేదు. న్యాయం జరగాలి. ఇలాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదన్నదే నా ఉద్దేశం’ అని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితులు ఎవరో తెలిసేదాకా న్యాయ పోరాటం ఆపనన్నారు. ఈ విషయంలో ఎంతోమంది పేరు తెలియని వారు సైతం సహకరిస్తున్నారన్నారు. తనకు మద్దతిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హత్య కేసులో ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే సీబీఐకి అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్రెండ్‌ అవుతున్న ‘జస్టిస్‌ ఫర్‌ వివేకా’ హ్యాష్‌ ట్యాగ్‌ 

వివేకానందరెడ్డి హత్యకు గురై బుధవారంతో నాలుగేళ్లు పూర్తవడంతో వారికి న్యాయం చేయాలని వేల సంఖ్యలో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ‘జస్టిస్‌ ఫర్‌ వైఎస్‌ వివేకా’ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. మరోవైపు ఎన్నడూ లేనంతగా పులివెందులలో వివేకా వర్ధంతి కటౌట్లు వెలిశాయి. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి చిత్రాలు మినహా ఇతరులవి ముద్రించి నివాళులర్పించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు