Andhra News: మద్యం ధరలు పెంచి.. అమ్మకాలు తగ్గిస్తున్నాం

మద్యం అమ్మకాలను తగ్గించేందుకే ధరలు పెంచామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

Updated : 18 Mar 2023 09:45 IST

బడ్జెట్‌ అంకెల గారడీ కాదు.. ఆదాయం పెరుగుతోంది
శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: మద్యం అమ్మకాలను తగ్గించేందుకే ధరలు పెంచామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో శుక్రవారం బడ్జెట్‌ సాధారణ చర్చకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ధరలు పెంచడంతో మద్యం అమ్మకాలు తగ్గాయి. మద్యం ఆదాయంపై ఆధారపడ్డామని తెదేపా వారు చెబుతున్నారు. దిల్లీ వెళ్లిన ప్రతిసారీ అప్పుల కోసమేనంటారు. తెదేపా హయాంలో చేసిన పాపాలను కడిగేందుకే 30 సార్లు దిల్లీ వెళ్లాను. రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కడా అంకెల గారడీ లేదు. ఆదాయం పెరుగుతోంది. కేంద్ర పన్నుల్లో వాటా 2020-21లో రూ.24,441 కోట్లు ఉంటే 2022-23కు రూ.38 వేల కోట్లకు పెరిగింది. 2023-24కు రూ.41వేల కోట్లకు ఎందుకు పెరగదు? స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 2020-21లో రూ.5వేల కోట్లకుపైగా ఉంటే 2022-23కు రూ.9వేల కోట్లకు పెరిగింది. దీన్ని ఈ బడ్జెట్‌లో రూ.12వేల కోట్లుగా చూపాం. రాష్ట్ర ఎక్సైజ్‌, పెట్రోల్‌పై వ్యాట్‌, వాహనపన్ను పెరుగుతున్నాయి. ద్రవ్యలోటు 2018-19లో రూ.35వేల కోట్లు ఉంటే.. 2020-21 నాటికి కొవిడ్‌ కారణంగా రూ.55వేల కోట్లకు చేరింది. గత ప్రభుత్వం పొరపాటు నిర్ణయాలు తీసుకుంది. ప్రచారార్భాటం తప్ప సరైన ప్రణాళిక లేదు. కేంద్రంతో సరైన సంబంధాలు లేవు. బిల్లులు బాగా పెండింగ్‌ పెట్టింది. 2019-20లో వీటిని పరిష్కరించే సమయంలోనే కొవిడ్‌ వచ్చింది. ఇవన్నీ ఆటంకాలుగా మారాయి. సామాన్యుడిని కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నాం. మేనిఫెస్టోకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. కొవిడ్‌ సమయంలో వ్యవసాయ రంగంలో పనులు కొనసాగించాం. నిబంధనలు పాటిస్తూ పరిశ్రమలను తెరిపించాం. డీబీటీ ద్వారా పారదర్శకంగా సాయం అందజేయడం, మహిళల అభివృద్ధికి ప్రణాళిక, సమాజ భాగస్వామ్యం పెంచినందున ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయంపై 62% ఆధారపడి ఉన్నారు. పెట్టుబడి వ్యయం 21% తగ్గించాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు విఫలం కావాలని తెదేపా చూస్తోంది’’ అన్నారు. ‘ఉచిత సేవలకు కాలం చెల్లింది.. ప్రజల నుంచి డబ్బులు సేకరించాలి, సబ్సిడీలంటే పులిపై స్వారీ చేయడమే.. కిలో రూ.2కు బియ్యం ఇచ్చిన ఎన్టీఆర్‌ ఓడిపోయారు’ అని చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాలనలో వేగం చూడకూడదని, శక్తిని గ్రహించాలని ఓ కోతి కథ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని