గాలివాన బీభత్సం

రాష్ట్రంలో గాలి, వానలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కురిసిన భారీవర్షాలు.. వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి.

Published : 19 Mar 2023 05:27 IST

సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
చెట్టు కూలి, పిడుగుపడి రెండు జిల్లాల్లో ఇద్దరు మహిళల మృతి
నేడూ రేపూ కొనసాగనున్న వర్షాలు

ఈనాడు, అమరావతి, జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గాలి, వానలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కురిసిన భారీవర్షాలు.. వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈదురుగాలులు, వడగళ్ల వానల ధాటికి సుమారు 2లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, మిరప, పెసర, మినుము పంటలతోపాటు  అరటి, బొప్పాయి, మామిడి తదితర పంటలకు అధికంగా నష్టం జరిగింది. ఈదురు గాలులకు రహదారుల వెంబడి ఉన్న భారీవృక్షాలు కూడా నేలకూలాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోయింది. 

* ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామానికి చెందిన మెట్ల సంధ్య(38) అనే మహిళ తాను ఉంటున్న ఇంటి పక్కనే చిన్న షెడ్‌ ఏర్పాటు చేసుకొని పచారీ దుకాణం నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం గాలుల ఉద్ధృతికి  దుకాణం పక్కన ఉన్న చెట్టు కూలి దుకాణంపై పడింది. ఈ ఘటనలో సంధ్య అక్కడికక్కడే మృతిచెందారు. మరోవైపు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అనంతపురం గ్రామంలో శ్రీవిద్య(38) పిడుగుపాటు గురై ప్రాణాలు కోల్పోయారు. అల్లూరు మండలం ఇసుకపల్లిలో నాలుగు పశువులు మృత్యువాత పడ్డాయి.

 

* శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో రైతుల దగ్గర భారీగా ధాన్యం ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో.. ఇంకా పొలాల్లో, ఇళ్ల ముందట పట్టాలు కప్పి నిల్వ చేశారు. ప్రస్తుత వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.   పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్‌, కర్నూలు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో మిరప రైతులు కోట్లాది రూపాయల మేర నష్టపోయారు.


నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

ఉత్తరాంధ్ర, మధ్యఆంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల ఆదివారం పిడుగులతో కూడిన మోస్తరు నుంచి  భారీ వర్షాలు..మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు.

* ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు(ఆది, సోమవారాల్లో) వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు